నటీనటులు: రఘు కుంచె, శ్రీకాంత్ అయ్యంగార్, వికాస్, రామచంద్రం, టీనా శ్రావ్య, మౌనిక తదితరులు
సంగీతం: రఘు కుంచె
దర్శకత్వం: చైతన్య మోటూరి
నిర్మాత: వాణి రవికుమార్ మోటూరి
విడుదల తేదీ: ఏప్రిల్ 24, 2026
కథ
కాకినాడకు చెందిన పేరుమోసిన రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె) రాజకీయాల్లోకి రావాలని ఆశపడతాడు. స్థానిక ఎమ్మెల్యే అండతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే అదే టికెట్‌ను ఆశించిన మరో నేత దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు విభేదాలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సమక్షంలోనే ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు దారుణ హత్యకు గురవుతాడు. అసలు గేదెల రాజును చంపింది ఎవరు? ఆ రాజకీయ వైర్యమే కారణమా? లేక ఈ హత్య వెనుక రిచ్ (వికాస్)-మీరా (మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య (టీనా శ్రావ్య) అనే జంటల ప్రమేయం ఉందా? అసలు ఈ ప్రేమజంటలకు, ఒక రౌడీ షీటర్‌కు ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు అనేదే ఈ సినిమా ఇతివృత్తం.
ఎలా ఉందంటే
దర్శకుడు చైతన్య మోటూరి ఈ చిత్రాన్ని ఒక నాన్-లీనియర్ మర్డర్ మిస్టరీగా మలిచారు. “చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు” అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే, క్లైమాక్స్ వరకు హంతకుడెవరనే ఉత్కంఠను కొనసాగించడంలో దర్శకుడు సఫలమయ్యారు. ముఖ్యంగా మహాభారతంలోని కనిక నీతిని ఈ కథకు ముడిపెట్టిన తీరు ప్రశంసనీయం. కథనంలో ఐదు ఉపకథలను జొప్పించడం వల్ల సినిమా కొంత వైవిధ్యంగా అనిపించినప్పటికీ, అవి స్క్రీన్‌ప్లేను నెమ్మదింపజేశాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉండటం, రౌడీ షీటర్ అని చెప్పిన రాజు పాత్ర బిల్డప్‌కు తగ్గ సీన్లు లేకపోవడం బలహీనతలుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది.
నటన & సాంకేతిక వర్గం:
నటుడిగా రఘు కుంచె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. గోదావరి యాసను పలికించడంలో, రౌడీ షీటర్ హావభావాలను ప్రదర్శించడంలో ఆయన పరిణతి కనిపించింది. అలాగే సంగీత దర్శకుడిగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్ తన అనుభవంతో మెప్పించగా, కొత్తవారైన వికాస్, రామచంద్రం, టీనా శ్రావ్య, మౌనిక తమ పరిధి మేరకు బాగా నటించారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది.
ప్లస్ పాయింట్లు:
రఘు కుంచె నటన, నేపథ్య సంగీతం.
ఎవరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్.
కనిక నీతిని కథకు అనుసంధానించిన విధానం.
మైనస్ పాయింట్లు:
సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం.
కొన్ని అనవసరమైన సాగదీత దృశ్యాలు.
స్క్రీన్‌ప్లేలో అక్కడక్కడా గందరగోళం.
చివరి మాట: మర్డర్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘గేదెల రాజు’ ఒకసారి చూడదగ్గ చిత్రం. కొన్ని సాగదీత సీన్లను పక్కన పెడితే, క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్: 2.75/5