జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించిన భారీ చిత్రం ‘రాకాస’. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటిస్తూ, ‘రాకాస’ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన యువ నటులు సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ మరియు పాటలతో టాలీవుడ్లో గట్టి బజ్ క్రియేట్ చేసింది.
శ్రీకాకుళం మట్టి నుంచి వచ్చిన తన సినీ ప్రస్థానం గురించి చిత్ర దర్శకురాలు వివరిస్తూ.. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ‘మ్యాడ్ హౌస్’తో తన ప్రయాణం మొదలైందని మానస గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్ మరియు రైటర్‌గా బాధ్యతలు నిర్వహించి, ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌తో దర్శకురాలిగా తన ముద్ర వేశానని తెలిపారు. ఈ అనుభవాలన్నీ ‘రాకాస’ వంటి భారీ ప్రాజెక్టును అత్యంత నాణ్యంగా తెరకెక్కించడానికి తనకు ఎంతగానో దోహదపడ్డాయని ఆమె పేర్కొన్నారు. విజువల్ వండర్‌గా, ఫాంటసీ మరియు అడ్వెంచర్ అంశాలతో కూడిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘రాకాస’ చిత్రం గురించి వివరిస్తూ, ఇది కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఫాంటసీ, అడ్వెంచర్ మరియు హారర్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక విభిన్నమైన జోనర్ అని, త్వరలో విడుదల కానున్న ట్రైలర్ ద్వారా సినిమా స్పష్టత మరింత పెరుగుతుందని ఆమె తెలిపారు. కథానాయకుడు సంగీత్ శోభన్ గురించి చెబుతూ, మొదట నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం అనుకున్న ఈ కథను ఆయన విన్నారని, ఆయన కామెడీ టైమింగ్ మరియు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రశంసించారు. అలాగే నటి నయన్ సారికతో ఇదివరకే పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆమె పాత్రను ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారని మానస పేర్కొన్నారు. సినిమా మేకింగ్ పరంగా నిహారిక కొణిదెల అందించిన సహకారం మరువలేనిదని, కథ విన్న పదిహేను నిమిషాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
బడ్జెట్ విషయంలో వస్తున్న రూమర్లపై స్పందిస్తూ, ప్రతి సినిమాకు కొంత హెచ్చుతగ్గులు సహజమని, అయితే తాము ముందుగా అనుకున్న పరిమితుల్లోనే నాణ్యమైన అవుట్‌పుట్‌ను రాబట్టగలిగామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఉండే భారీ వీఎఫ్ఎక్స్ పనుల కోసం ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుండగానే ఫస్టాఫ్ షూటింగ్ పూర్తి చేసి సమయాన్ని ఆదా చేశామని వివరించారు. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయని, విజువల్స్ మరియు సౌండింగ్ పరంగా ఇదొక అందమైన చందమామ కథలా ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. నిర్మాతగా నిహారిక కొణిదెల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంలో సిద్ధహస్తురాలని, ఆమెతో కలిసి పనిచేయడం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతూ, భవిష్యత్తులో కూడా కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే కథలతో ముందుకు వస్తానని మానస శర్మ వెల్లడించారు.