అల్లు అర్జున్-అట్లీ సినిమా మొదలై ఏడాదికావొస్తున్నది. అరవైశాతానికిపైగా షూటింగ్ కూ డా పూర్తయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్ విషయంలో మేకర్స్ చాలా గోప్యంగా ఉన్నారు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ బుధవారం అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని షాకింగ్ లుక్‌తో కూడిన టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం పేర్కొన్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ గంటల వ్యవధిలోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గుండుతో కనిపిస్తూ మనిషి, మృగాన్ని పోలిన లుక్‌లో బన్నీ అందరినీ సర్ప్రైజ్ చేశారు.
రాక్షసుడు, రాకాస అనే అర్థాన్ని స్ఫురించేలా ఈ టైటిల్‌ను ఖరారు చేశారని సోషల్‌మీడియాలో చర్చ నడుస్తున్నది. ‘రాకా’ అంటే పౌర్ణమి అనే అర్థంలో కూడా కొందరు టైటిల్‌పై విశ్లేషణ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని తెలిసింది. తాజా ఫస్ట్‌లుక్ నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌కు సంబంధించినదని, మరో పాత్ర తాలూకు లుక్‌ను త్వరలో రివీల్ చేస్తారని అంటున్నారు.
ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఉద్దేశించి ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’..‘మీ అందరి ఊహలకు మించి ఈ సినిమా ఉంటుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి’ అంటూ చిత్రబృందం పెట్టిన క్యాప్షన్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్‌కు ధీటైన విజువల్ ఎఫెక్ట్స్‌తో, భారీ సాంకేతిక హంగులతో వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారని మేకర్స్ అంటున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ కథ ఇదని, భారతీయ పురాణాల ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం. దీపికా పడుకోన్ ఈ సినిమాలో కథానాయిక. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.