Pranay Reddy Vanga | పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా ఫిక్స్ అయిన బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే తర్వాత తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా ఎందుకు తప్పుకున్నారు అనే విషయంపై గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
తాజాగా ఈ వివాదంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా దీపికాతో టచ్‌లో ఉన్నారని, ఆమె ప్రతిభ మీద నమ్మకంతోనే లీడ్ రోల్ కోసం సంప్రదించామని ప్రణయ్ వెల్లడించారు. అయితే ఆ టైమ్‌లో ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో ఆమె డిమాండ్లు పూర్తిగా మారిపోయాయని ఆయన తెలిపారు. కేవలం భారీ రెమ్యూనరేషనే కాకుండా, ఏకంగా సినిమా నికర లాభాల్లో 10 శాతం వాటా (Profit Share) కావాలని ఆమె పట్టుబట్టారని ప్రణయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కేవలం ఆర్థికాంశాలే కాకుండా, షూటింగ్ కాల్షీట్లు మరియు ప్రొఫెషనల్ పని గంటల విషయంలోనూ ఆమె పెట్టిన కొన్ని కండిషన్స్ చిత్ర యూనిట్‌కు పొసగలేదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ తమకు వర్కవుట్ కాదని భావించి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తరుణంలో, సినిమా కథకు సంబంధించిన కొన్ని అత్యంత గోప్యమైన ఇంటర్నల్ విషయాలను ఆమె పీఆర్ (PR) టీమ్ ద్వారా బయటకు లీక్ చేయించారని ప్రణయ్ తీవ్రంగా ఆరోపించారు. ఇలా దర్శకుడు ముందస్తుగా నమ్మి చర్చించిన విషయాలు బహిర్గతం కావడం వల్ల సందీప్ రెడ్డి వంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పించి, ఆ తర్వాతే నూతన నాయిక త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) ని ఖరారు చేసినట్లు ప్రణయ్ వివరించారు.