అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…‘ఇదొక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య కథ సాగుతుంటుంది. బలమైన భావోద్వేగాలు ఉంటాయి. అఖిల్ కెరీర్ ఈ సినిమాకు ముందు, తర్వాత అని చెప్పుకోవచ్చు. విజువల్స్ గ్రాండ్‌గా ఉండి..గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. యాక్షన్‌తో పాటు హీరో క్యారెక్టర్లో వినోదం మిళితమై ఉంటుంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఓ పెద్ద సవాలు తీసుకుంటున్నాం అని తెలుసు. ఆ సవాలును సాధించామనే భావిస్తున్నాం. స్పై సినిమా కాబట్టి యాక్షన్ సీక్వెన్సులు విదేశాల్లో చిత్రీకరించాం. ఈ సినిమాలో స్టంట్స్ విషయంలో అఖిల్ చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయి. మా చిత్రాన్ని జేమ్స్‌బాండ్ సినిమాతో పోల్చితే సంతోషమే. ఇది భాషలకు అతీతంగా అందరికీ నచ్చుతుంది.. అయితే ముందు తెలుగు మీద దృష్టి పెడుతున్నాం. డబ్బింగ్ అంతా పూర్తయి ఉంది. రెండు వారాల తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. అభిరుచి గల నిర్మాతలు డబ్బు కంటే విజయాన్నే కోరుకుంటారు. హిట్ అయిన సినిమాలకు కూడా కొన్నిసార్లు ఆదాయం రాదు. సంస్థకు పేరు తెచ్చే చిత్రాలు నిర్మించాలనేది మా ఆలోచన.’ అన్నారు.