Prithviraj Sukumaran Kaduva Teaser | మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఈయన నటించిన సినిమాలు విడుదల కాకపోయినా ఓటీటీలలో సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరీ ప్రేక్షకులు ఈయన సినిమాలను వీక్షిస్తున్నారు. పృథ్విరాజ్ సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టు అని మలయాళంలో ఒక ఫార్ములా ఉంది. ఇటీవలే ఈయన నటించిన ‘జన గణ మన’ మలయాళంలో సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఒక్క మలయాళ భాషలోనే కాకుండా ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈయన దేశవ్యాప్తంగా మార్కెట్‌ను ఏర్పరుచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే పృథ్వి నటించిన ‘కడువా’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నాడు.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రస్తుతం సౌత్‌లోని నాలుగు సిటీలలో ప్రమోషన్లు చేయడానికి బృందం పయనమైంది. శుక్రవారం బెంగళూర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించగా.. శనివారం హైదరాబాద్‌లో అవాస హోటల్లో సాయంత్రం నాలుగు నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ ప్రెస్ మీట్లోనే తెలుగు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. షాజి కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌తో కలిసి పృథ్విరాజ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Hello Hyderabad! 🤗 #కడువా Telugu Teaser launching today at Pre-Release Press Meet! 🐅#Kaduva @PrithviOfficial @iamsamyuktha_ #ShajiKailas @vivekoberoi @PrithvirajProd @magicframes2011 @Poffactio @urstanaysuriya @UrsVamsiShekar pic.twitter.com/RO02ctRrfA
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 25, 2022