ప్రాంతీయత, జాతీయవాదం అజెండాగా ‘మా’ ఎన్నికలు జరిగాయని..ఆత్మగౌరవం ఉన్న కళాకారుడిగా తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాష్‌రాజ్ తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీచేసిన ఆయన మంచు విష్ణు చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రకాష్‌రాజ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ‘మా’ అసోసియేషన్ నుంచి బయటకు వెళ్లినప్పటికీ తెలుగు సినిమాకు మాత్రం దూరం కానని ఆయన స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్ తాను తెలుగుబిడ్డను కాదంటున్నదని, అందుకే ఆ సంఘం నుంచి వైదొలుగుతున్నానని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు. ‘తెలుగు వ్యక్తి కాని వారు ఓటు వేయవచ్చు కానీ ఎన్నికల్లో నిలబడకూడదనే నినాదాన్ని తీసుకొచ్చారు. తాము గెలిస్తే ‘మా’ అసోసియేషన్ అనుబంధ నియమాల్ని మార్చి తెలుగేతరులు పోటీకి అనర్హులుగా చేస్తామని అంటున్నారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా తప్పు కాదు. వాళ్ల తప్పు కాదు’ అంటూ ప్రకాష్‌రాజ్ భావోద్వేగానికి గురయ్యారు. అసోసియేషన్ వారు తెలుగుబిడ్డ నాయకత్వానే కోరుకున్నారని, దానికి సభ్యులు కూడా ఆమోదించారని ప్రకాష్‌రాజ్ చెప్పారు.
బంధం కొనసాగుతుంది.
రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని, తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధం కొనసాగుతుందని ప్రకాష్‌రాజ్ అన్నారు. ‘అతిథులు అతిథులుగానే ఉండాలని మోహన్‌బాబు, కోటశ్రీనివాసరావు వంటి పెద్దలు అన్నారు. నేను అలాగే ఉండాలనుకుంటున్నా. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. అయితే మున్ముందు తెలుగు సినిమాల్లో నటిస్తా. తెలుగు నటీనటులతో కలిసి పనిచేస్తా. నేను యూనివర్సల్ నటుడిని. తెలుగేతరులు ఇక్కడ నటించొద్దని ఎవరూ చెప్పలేదు. విష్ణు సినిమాల్లోనూ నేను నటిస్తా. ఇతర భాషా నటీనటులతో కలిసి యూనియన్ పెట్టేంత సంకుచిత మనస్తత్వం నాది కాదు’ అని ప్రకాష్‌రాజ్ అన్నారు. ‘మా’ ఎన్నికలు ముగిశాయి కాబట్టి మనమంతా ఒక్కటే..అందరం కలిసి పనిచేద్దామని అంటున్నారు..అయితే అలాంటి అబద్ధ్దాల్ని తాను నమ్మనని ప్రకాష్‌రాజ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తానేమీ బాధితుడిని కాదని, తనకు తానుగా బతికానని..భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానన్నారు.
ఎన్నికల నుంచి చిరంజీవి తప్పుకోమన్నారు
‘ప్రకాష్‌రాజ్‌ను ఏకగ్రీవం చేయడానికి తనను ఎన్నికల నుంచి తప్పుకోమని చిరంజీవి కోరారని మంచు విష్ణు అన్నారు. ప్రకాష్‌రాజ్ అంటే తనకు చాలా ఇష్టమని, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ “మా’ సభ్యత్వానికి ప్రకాష్‌రాజ్, నాగబాబు చేసిన రాజీనామాలను అంగీకరించను. ప్రకాష్‌రాజ్ ఆలోచనలు, సలహాలు నాకు కావాలి. నాలుగైదు రోజుల్లో ఇద్దరిని కలుస్తాను. నాన్ తెలుగు అనే మాటను నేను వాడలేదు. ఆ భావన వల్లే ప్రకాష్‌రాజ్ ఓడిపోయారన్నది అబద్ధం. తెలుగు కళామతల్లిని నమ్ముకున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీచేయవచ్చు. తెలుగు బిడ్డలు మాత్రమే పోటీచేయాలని నేను వ్యాఖ్యలు చేశాననే మాటల్లో వాస్తవం లేదు. రామ్‌చరణ్ నాకు మంచి మిత్రుడు. కానీ తండ్రి మాటకు కట్టుబడి తన ఓటును ప్రకాష్రాజ్కే వేశాడు’ అన్నారు.