ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకుడు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో, సైఫ్అలీఖాన్ లంకేష్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇప్పటివరకు భారతీయ తెరపై చూడని విజువల్ వండర్ ఇది. ప్రభాస్ సరికొత్తగా దర్శనమిస్తారు. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. ‘చెడుపై మంచి గెలిచే యుద్ధం’ అనే నినాదంతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఫళణి, సంగీతం: సచేత్-పరంపర, నిర్మాతలు: భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, దర్శకుడు: ఓం రౌత్.