Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఉప్పెన’తో తన ప్రతిభను చాటుకున్న బుచ్చిబాబు ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది. ఇటీవల ముంబైలో విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. యాక్షన్, భావోద్వేగాలు, రామ్ చరణ్ మాస్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ మరో భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రత్యేక మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమం భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ (BHEL) గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక లైవ్ కాన్సర్ట్ ఇవ్వనుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన తెచ్చుకోగా, ఈ ఈవెంట్లో మరో స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక సౌండ్ సిస్టమ్స్, ప్రత్యేక లైటింగ్ పరికరాలు, సాంకేతిక సామగ్రిని ముంబై నుంచి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మ్యూజికల్ జాతరను అత్యంత గ్రాండ్‌గా, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు గాను ముంబై నుండి సుమారు రూ. 150 కోట్ల విలువైన అధునాతన సౌండ్, లైటింగ్ మరియు ప్రత్యేక సాంకేతిక పరికరాలను భోపాల్‌కు తరలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ కాన్సర్ట్ సెటప్ కోసం తీసుకొస్తున్న పరికరాల అద్దె ఖర్చే రోజుకు దాదాపు రూ. 1 కోటి వరకు ఉంటుందని సమాచారం. ఈ భారీ లెక్కలను బట్టి చూస్తుంటే, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కోసం మేకర్స్ ఏ రేంజ్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారో అర్థం అవుతుంది.ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.