ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్రహీరోలు ఎన్టీఆర్,రామ్‌చరణ్. సినిమా గ్రాండ్ సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే తమ తదుపరి సినిమాలకు సమాయత్తమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ నటించబోతున్న విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా అభిమానుల్లో అంచనాల్ని పెంచుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నవ్యరీతితో సాగుతుందని, ఆయన ద్విపాత్రాభినయంతో కనిపిస్తారని తెలిసింది. ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమా ఇది కావడం విశేషం. నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.