సినిమా : ఓం భీమ్ బుష్
తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషాఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్..
దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
నిర్మాతలు: వి.సెల్యులాయిడ్, సునీల్ బులుసు..
సమర్పణ: యూవీ క్రియేషన్స్
Om Bheem Bush | రాజరాజచోర, సామజవరగమన సినిమాలతో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ఓం భీమ్ బుష్’. ఈ శుక్రవారం విడుదలైంది. నిజానికి సినిమా ఆద్యంతం కామెడీ పండించటానికి శ్రీవిష్ణు ఒక్కడుంటే చాలు. కానీ ఈ సినిమాలో శ్రీవిష్ణుతోపాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా తోడయ్యారు. దాంతో సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? నవ్వించడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి
క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మ్యాడీ రేలంగి(రాహుల్ రామకృష్ణ) లెగసీ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులు. వీరి అల్లరి భరించలేక, బలవంతంగా వీరిని పాస్ చేయించి మరీ యూనివర్సిటీ నుంచి బయటకి గెంటుతాడు ఆ కళాశాల ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగార్). షెల్డర్ పోవడంతో ముగ్గురూ భైరవపురం చేరుకుంటారు. ఆ ఊరులో ఎ టు జెడ్ సర్వీసెస్ అనే దుకాణం తెరుస్తారు. తమకు తెలిసిన విద్యలను ఉపయోగించి, అందరినీ తెలివిగా మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. అయితే, వీళ్లు ముగ్గురూ చేస్తున్న మోసం ఆ ఊరు జనానికి తెలిసిపోతుంది. దాంతో ఆ ఊరి పెద్ద ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఆ ఊళ్లో ఉన్న సంపంగిమహల్లో బంగారు నిధి ఉంటుంది. ఆ నిధిని తీసుకొస్తే మీరు మోసగాళ్లు కాదని నమ్ముతాం అంటారు. అసలు విషయం ఏంటంటే.. ఆ మహల్లో దెయ్యం ఉంటుంది. దానిపేరు సంపంగి. ఈ విషయం తెలిసి కూడా ఆ మహల్లోకి అడుగుపెడతారు హీరోలు ముగ్గురూ. మరి వారి మహల్లోకెళ్లిన ముగ్గురుకీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ మహల్‌లోని సంపగి దెయ్యం కథేంటి? ఈ ప్రశ్నలకు సమధానమే మిగతా కథ..
కథా విశ్లేషణ
‘లాజిక్కుల్లేవు.. ఓన్లీ మ్యాజిక్కే’ అని ముందే దర్శకుడు చెప్పేశాడు కాబట్టి, లాజిక్కులు వెతక్కూడదు. నవ్వించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని తీసిన సినిమా ఇది. దానికి తగ్గట్టే కథ, కథనం రాసుకున్నాడు. డైలాగులు కూడా. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సినిమా ఆద్యంతం పగలబడి నవ్వించారు. వారి నుంచి వచ్చే చిన్న చిన్న డైలాగులు ప్రేక్షకుల పొట్టచెక్కలు చేస్తాయి. నిజానికి నవ్వించడం కష్టమైన ప్రక్రియ. అందుకు తగ్గట్టుగా డైలాగులు రాసుకోవడం ఇంకా కష్టమైన ప్రక్రియ. ఈ విషయంలో దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం. ఇలాంటి స్క్రిప్ట్ రాయడం తేలికైన విషయం మాత్రం కాదు. సినిమా నిడివి రెండు గంటల 10 నిమిషాలు మాత్రేమే. దానిలో చివరి పావుగంట మినహా.. సినిమా అంతా సరదాగా సాగిపోయింది. చివరి పది నిమిషాలు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. ఎంత లాజిక్కులతో పని లేకపోతే మాత్రం.. ఫిక్షన్‌కి కూడా అందని విషయాలు తెరపై జరుగుతుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బంది అనిపిస్తుంది. అదే జరిగింది.
నటీనటుల నటన
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ముగ్గురూ నాన్‌స్టాప్‌గా నవ్వించారు. ఓ విధంగా సినిమా మొత్తాన్ని ఈ ముగ్గురే భుజాలపై మోశారనాలి. ఇక పాత్ర నిడివి తక్కువే అయినా శ్రీకాంత్ అయ్యంగార్ కూడా చాలా బాగా చేశాడు. మిగతా పాత్రధారులకు అంత ఇంపార్టెంట్ లేదు. అయితే ఆ దెయ్యం పాత్ర పోషించిన కుర్రాడెవరోకానీ.. చాలా బాగా చేశాడు. అతను బేసిగ్గా క్లాసికల్ డాన్సర్ కావడం చేత, అద్భుతంగా నటించాడు, నర్తించాడు.
టెక్నికల్‌గా
ఈ సినిమా విషయంలో ముందు మాట్లాడుకోవాల్సింది దర్శకుడి గురించి. గత చిత్రాలకు భిన్నమైన కథను రాసుకొని, దాన్ని చక్కగా తీశాడు కూడా. ఏ ఉద్దేశంతో ఈ సినిమా చేశాడో అది నెరవేరిందనే చెప్పాలి. నవ్వించడం కోసమే ఈ సినిమా. అనుకున్నట్టే నవ్వించాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డైలాగులు నిజంగా సూపర్. చిన్న చిన్న డైలాగులతో పకపకా నవ్వించాడు దర్శకుడు శ్రీహర్ష. సన్నీ ఎం.ఆర్ పాటలు వినడానికీ, చూడ్డానికీ కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం అయితే నెక్ట్స్ లెవల్. కెమెరా టింట్ కూడా కొత్తగా ఉంది. ఎడిటర్ పనితనాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇక్కడా ల్యాగ్ లేకుండా, చక్కగా 2గంటల 10 నిమిషాల్లో సినిమాను ముగించేసి, అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ జనాలకు కలిగించాడు. మొత్తంగా కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునేవాళ్లకు బెస్ట్ ఆప్షన్ ఈ ‘ఓం భీమ్ బుష్’
ప్లస్ పాయింట్స్: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, డైలాగులు, కెమెరా..
మైనస్ పాయింట్స్ : సినిమా చివరి పదినిమిషాలు..
రేటింగ్ : 3.00/5