Oh Sukumari | విభిన్నమైన కథాంశాలతో టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్, వెర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓ సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో, మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ ప్రమోషన్ల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “హీరోయిన్ను తాకితే షాక్ కొడుతుంది” అనే సరికొత్త వింత కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ కథనంలో చూద్దాం.
కథ
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. యాదగిరి (తిరువీర్) ఎలాగైనా ఊరికి సర్పంచ్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే అతని తమ్ముడు (గవిరెడ్డి)తో అస్సలు పడదు. వీరి తాత వీలునామా ప్రకారం… అన్నదమ్ముల్లో ఎవరికి ముందుగా మగ బిడ్డ పుడితే, వారికే 80 ఎకరాల ఆస్తి దక్కుతుంది. దీంతో ఇద్దరూ పెళ్లి కోసం పోటీ పడతారు. తమ్ముడు ముందే ఒక గర్భవతి అయిన అమ్మాయిని వివాహం చేసుకోగా, యాదగిరి కూడా పెళ్లి చూపుల్లో దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అయితే, దామినికి చిన్నప్పటి నుండి “ఎవరిని ముట్టుకున్నా షాక్ కొట్టే” ఒక వింత సమస్య ఉంటుంది. ఊరి జనం ఈ విషయాన్ని దాచిపెట్టి యాదగిరితో ఆమెకు పెళ్లి జరిపిస్తారు. శోభనం రాత్రి ఈ చేదు నిజం తెలిసిన యాదగిరి షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆస్తి ఎవరికి దక్కింది? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ:
ఒక వింత శారీరక సమస్య ఉన్న అమ్మాయి చుట్టూ కథను అల్లుకోవడం పేపర్ మీద వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దర్శకుడు భరత్ దర్శన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారనిపిస్తుంది. తెలంగాణ యాసలో సాగే వన్-లైనర్ కామెడీ సీన్లు, కొన్ని వినోదాత్మక సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో ప్రధాన కాన్ఫ్లిక్ట్ (సమస్య) బలమైన ఎమోషన్‌ను పండించలేకపోయింది. ముఖ్యంగా హీరోయిన్‌కు కొన్నిసార్లు షాక్ కొట్టడం, కొన్నిసార్లు కొట్టకపోవడం వెనుక ఉన్న లాజిక్‌ను దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దీనివల్ల ప్రేక్షకుడు కథతో పూర్తిగా కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతుంది.
నటీనటుల ప్రతిభ:
భార్యా బాధితుడైన భర్తగా, అమాయకపు పల్లెటూరి యువకుడిగా తిరువీర్ తన నటనతో మరోసారి అదరగొట్టాడు. తన పాత్రలో చాలా ఈజ్‌తో నటించి మెప్పించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఐశ్వర్యకు ఇది చాలా భిన్నమైన పాత్ర. నటనకు ప్రాధాన్యమున్న ఈ వింత పాత్రలో ఆమె జీవించేసింది. ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం:
భరత్ మంచీరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలు కథా గమనంలో భాగంగా సాగిపోతాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించాయి. మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
బాటమ్ లైన్:
‘ఓ సుకుమారి’ అనేది ఒక డిఫరెంట్ షాకింగ్ కాన్సెప్ట్ మరియు కొన్ని ఎంగేజింగ్ కామెడీ మూమెంట్స్ ఉన్న చిత్రంగా నిలిచింది. కొత్తదనాన్ని కోరుకునే వారు ఒకసారి థియేటర్లలో చూసి ఆస్వాదించవచ్చు.
రేటింగ్: 2.75 / 5