Dragon | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్నాళ్లు ‘NTR Neel’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలిచిన ఈ సినిమాకు ఇటీవల అధికారికంగా డ్రాగన్ అనే టైటిల్‌ను ప్రకటించారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా “డెవిల్ జన్మించాడు” అంటూ వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి వివరాలు బయటకు రానివ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించడం ఆయన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఇప్పటి వరకు తాను రాసిన పాత్రల్లో అత్యంత డార్క్, పవర్ఫుల్ క్యారెక్టర్ ‘లూగర్’ అని చెప్పారు. ఈ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారని వెల్లడించారు. “నేను ఇప్పటి వరకు రాసిన పాత్రల్లో ఇది చాలా డార్క్‌గా ఉంటుంది. సాధారణ హీరో పాత్రలా కాకుండా, ప్రేక్షకులు ఊహించని కోణంలో ఉంటుంది. ఆడియన్స్‌ను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మాకు లేదు. అందుకే గ్లింప్స్‌లోనే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా ఒక విలన్ అని సూచించాం” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. అలాగే ఈ సినిమాలో ఇండియన్ సినిమాలోనే అత్యంత ఖరీదైన విలన్స్ కనిపించబోతున్నారని కూడా పేర్కొన్నారు. లూగర్ పాత్రను అత్యంత శక్తివంతంగా డిజైన్ చేసినట్లు చెప్పారు.
నాలుగున్నర నిమిషాల నిడివితో గ్లింప్స్ విడుదల చేయడంపై స్పందిస్తూ.. “ఇది మా సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పే మొదటి ప్రయత్నం. కథ మొదలుపెట్టాక ప్రేక్షకులు దానిలో లీనమవ్వాలి. అందుకే ఏం చెప్పాలి? ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అనే విషయాలపైనే ఫోకస్ చేశాం” అని వివరించారు.ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి కూడా ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నేను గత 25 సంవత్సరాలుగా ఎన్టీఆర్‌కు అభిమానిని. ఆయన నటించిన మాస్ సినిమాలన్నీ చూశాను. ఐదేళ్ల క్రితం మొదటిసారి మేం కలిశాం. అప్పుడు కథ లైన్ చెప్పాను. కథలో పాత్ర మంచిదా చెడ్డదా అని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. డ్రామా వర్క్ అవుతుందా లేదా అనేదే చూశారు. పూర్తి కథ సిద్ధం చేయడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది” అని అన్నారు.
ఇక ‘లూగర్’ పాత్ర కోసం ఎన్టీఆర్ చేసిన కష్టాన్ని ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “కేవలం నాలుగు నెలల్లోనే ఎన్టీఆర్ 15 కిలోల బరువు తగ్గారు. ఆయన్ని చూసి నేను షాక్ అయ్యాను. చాలా బలహీనంగా కనిపించడం చూసి ఆపేయమని చెప్పినా ఆయన వినలేదు. నా విజన్ కోసం ఏదైనా చేస్తానని చెప్పారు. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అద్భుతం” అని ప్రశంసించారు. ఈ సినిమాలోని డ్రామా భాగాన్ని తాము ఇద్దరం కలిసి డెవలప్ చేసినట్లు కూడా ప్రశాంత్ నీల్ వెల్లడించారు.