ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరో గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా తాజాగా ప్రకటించిన 50వ శాటర్న్ పురస్కారాల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపికైంది. ఆమెరికాకు చెందిన శాటర్న్ అవార్డులను ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు అందుకుంటాయి. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ..ఇలా మూడు విభాగాల్లో అవార్డులకు ఈ సినిమాను నామినేట్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ…‘మా చిత్రానికి శాటర్న్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. బాహుబలి, ద కన్క్లూజన్ సినిమాకు తొలిసారి శాటర్న్ పురస్కారం గెల్చుకున్నాను. ఇది రెండోసారి. ప్రస్తుతం జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శన కార్యక్రమాల్లో ఉండటం వల్ల ఈ పురస్కార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నా. ఇతర పురస్కార విజేతలకు శుభాకాంక్షలు’ అని అన్నారు.