‘కేడీ: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అసభ్య, అశ్లీల పదాలతో ఈ పాటను రూపొందించారని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ పాట వివాదంతో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్‌దత్ జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణలు తెలిపారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా తాను ఆదివాసీ బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాజాగా ఈ పాటలో నర్తించిన నటి నోరా ఫతేహి గురువారం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణ చెప్పారు.
తెలియకుండా తప్పు జరిగిపోయిందని, ఇకముందు బాధ్యతగా ఉంటానని కమిషన్‌కు విన్నవించింది. తాను కూడా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనాథ బాలికల విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తానని పేర్కొన్నది. ఈ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు సైతం ఇటీవలే మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. ధ్రువ సర్జా కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలైంది. ఇందులో విలన్‌గా సంజయ్‌దత్ నటించారు. ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటను సంజయ్‌దత్, నోరా ఫతేహిపై చిత్రీకరించారు.