Raakasa Movie | కమిటీ కుర్రాళ్లు వంటి సూపర్ హిట్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెలా నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించగా.. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, రోహిణి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఎలా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
వీరబాబు అలియాస్ ఈరబాబు (సంగీత్ శోభన్) తన చిన్ననాటి ప్రియురాలు సుకన్యను వెతుక్కుంటూ అమెరికా నుంచి సొంత గ్రామానికి వస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె దూరం కావడంతో, గ్రామంలోనే ఉండే సుబ్బలక్ష్మి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో, సోము (వెన్నెల కిషోర్) హత్య కేసులో వీరబాబు అనూహ్యంగా ఇరుక్కుంటాడు. ఆ గ్రామంలోని ఒక పురాతన కోటలో భయంకరమైన రాక్షసుడు నివసిస్తున్నాడని గ్రామస్థుల నమ్మకం. సోమును హత్య చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వీరబాబును ఆ కోటలోని రాక్షసుడికి బలి ఇవ్వాలని గ్రామ పెద్ద (బ్రహ్మాజీ) మరియు గ్రామస్థులు తీర్పునిస్తారు. అలా ఆ భయానక కోటలోకి ప్రవేశించిన వీరబాబుకు రాక్షసుడు ఎదురయ్యాడా? అసలు ఆ కోటలో రాక్షసుడు ఉన్నాడన్న ప్రచారానికి గల ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? చిన్ననాటి ప్రియురాలు సుకన్యను వీరబాబు ఎందుకు దక్కించుకోలేకపోయాడు? సుబ్బలక్ష్మితో అతని ప్రేమ ఎలా చిగురించింది? చివరకు ఆ పాడుబడిన కోట నుంచి వీరబాబు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ ‘రాకాస’ చిత్రం.
విశ్లేషణ:
దర్శకురాలు మానస శర్మ పాతకాలపు చందమామ కథకు నేటితరం కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ జోడించి ఒక చక్కటి సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. బలమైన సన్నివేశాలు, వాటికి తోడుగా పేలిన డైలాగ్స్, వేగంగా సాగే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా ప్రథమార్థం మొత్తం స్వచ్ఛమైన హాస్యం, వినోదభరితమైన సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌కు కావలసిన బలమైన పునాదిని ఇక్కడే దర్శకురాలు పక్కాగా సెట్ చేశారు. ద్వితీయార్థం ఈ సినిమాకు ప్రాణమని చెప్పాలి. సినిమా టేకాఫ్ అయిన తర్వాత క్లైమాక్స్ వరకు ఎక్కడా కథనం నెమ్మదించకుండా శరవేగంగా పరుగులు పెడుతుంది. ఆద్యంతం నవ్విస్తూనే క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్స్ పండించడంలో దర్శకురాలు సఫలమయ్యారు.
నటీనటుల ప్రతిభ:
యువ హీరో సంగీత్ శోభన్ తన వన్ మ్యాన్ షోతో సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడు. అతని టైమింగ్, ఈజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీనుతో, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో సంగీత్ పండించిన కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తుంది. హీరోయిన్ నయన్ సారిక తన నటనతో ఆకట్టుకోగా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ బాగా కుదిరాయి. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రోహిణి తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
అనుదీప్ దేవ్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. రాజు ఎదురోలు కెమెరా పనితనం సినిమాలోని పల్లెటూరి వాతావరణాన్ని, పురాతన కోట మూడ్‌ను చాలా లైవ్లీగా స్క్రీన్‌పై చూపించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత నిహారిక కొణిదెల అనుసరించిన నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కథపై ఆమెకున్న నమ్మకం, అభిరుచి సినిమా మేకింగ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
చివరిగా: ‘రాకాస’ పక్కా విఠలాచార్య తరహా సోషియో ఫాంటసీ చిత్రం. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా.. తెలిసిన కథనే అద్భుతమైన కామెడీతో, గ్రిప్పింగ్ నరేషన్తో తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. లాజిక్కులు వెతక్కుండా, కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ వారం పర్ఫెక్ట్ ఛాయిస్ ‘రాకాస’.