Newtons 3rd Law | క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఊహించని ట్విస్టులు, మర్డర్ మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథలు ఓటీటీలో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law) డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.యంగ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదల కాగా, ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీ బాట పట్టడం విశేషంగా మారింది. ‘న్యూటన్స్ థర్డ్ లా’ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆగస్టు 28 నుంచి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఇలాంటి థ్రిల్లర్ కథలు ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో థియేటర్లలో వచ్చిన స్పందనకు భిన్నంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించారు. సుమంత్‌తో పాటు సీనియర్ నటుడు జగపతి బాబు, ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి వర్మ, షెల్లీ ఎన్. కుమార్, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, పండిట్ గౌతమ్, రూపేశ్ మార్రపు, హరిణిరావు, అభినయన తదితరులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సింజిత్ యర్రమిల్లి సంగీతం అందించగా, హరీశ్ కొహిర్కర్ నిర్మించారు. ముఖ్యంగా సుమంత్‌ను మరోసారి సీరియస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చూడబోతుండటం థ్రిల్లర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘న్యూటన్స్ థర్డ్ లా’ కథ మొత్తం ఒక అనుమానాస్పద మరణం చుట్టూ తిరుగుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్ (త్రినాథ్ వర్మ) ఒక రోజు ఇంటి పై నుంచి పడి మృతి చెందుతాడు. తొలుత ఇది సాధారణ ప్రమాదమా? లేక ఆత్మహత్యా? అనే సందేహాలు వ్యక్తమవుతాయి అయితే కేసు దర్యాప్తులో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. వినయ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో అతని తలలో బుల్లెట్ ఉన్నట్లు బయటపడుతుంది. దీంతో ఈ కేసు సాధారణ ప్రమాదం కాదని స్పష్టమవుతుంది.ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో సుమంత్ రంగంలోకి దిగుతాడు. దర్యాప్తు ప్రారంభించిన కొద్దీ వినయ్ జీవితం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే కొద్దీ మరో కొత్త ట్విస్ట్ బయటపడేలా దర్శకుడు కథను రూపొందించారు..