‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన కొత్త సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. సంజన ఆనంద్ నాయికగా నటిస్తున్నది. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కిరణ్ అబ్బవరం.
దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ నా ఫేవరేట్ మూవీస్. ఆయన కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాణంలో నటించడం ఆనందంగా ఉంది. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. అంతర్లీనంగా ఒక మంచి అంశాన్ని చెప్పాం. ఎస్వీ కృష్ణారెడ్డి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులోని తండ్రీ కూతురు భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
నేను కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాను. ఇలాంటి సమయంలో విడుదల అవుతున్న ఈ సినిమా నా కెరీర్‌కు బలాన్నిస్తుంది. నాకు హీరోగా పేరు తెచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. ఇందులో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపిస్తాను. నాయిక సంజనకు కూడా మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఈ చిత్రానికి నేనే మాటలు రాశాను. బాబా భాస్కర్ నా కాంబినేషన్ సన్నివేశాలు సరదాగా ఉంటాయి. నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే సినిమా అనుకున్నట్లు వచ్చింది. మణిశర్మ సంగీతంతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మాస్కు కావాల్సిన ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ చేశాం. ఈ సినిమా దర్శకుడు శ్రీధర్ గాదెతో మరో సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయి.
ప్రస్తుతం వరుస చిత్రాలతో తీరికలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో చేస్తున్న ‘మీటర్’ సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాయి. ఏఎం రత్నం నిర్మాతగా చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా 40శాతం చిత్రీకరణ కంప్లీట్ చేశాం.