కర్ణాటకలోని మంగళూరు తీరం మనోహరంగా ఉంటుంది. అక్కడి అరబిక్ కడలి అందాన్ని మించిన సొగసరి నటీమణులకు మంగళూరు కేరాఫ్. ‘డీజే టిల్లూ’తో తెలుగువారిని ఉర్రూతలూగించిన నటి నేహా శెట్టిదీ ఆ ఊరే! కన్నడ తీరంలో మొదలైన ఈ అందాల తుఫాను ఇప్పుడు టాలీవుడ్‌పై కేంద్రీకృతమైంది. వరుస అవకాశాలతో ఎడతెరిపి లేకుండా విజయాలు సాధిస్తున్నది. త్వరలోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్న నేహ పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే..
Neha Shetty | చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీకీ, మా కుటుంబానికీ సంబంధమే లేదు. మా అమ్మ డెంటిస్ట్. నాన్న బిజినెస్‌మ్యాన్. స్కూల్ డేస్‌లో డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. స్కూల్ డ్రామాల్లో తప్పకుండా పాల్గొనేదాన్ని. తరచూ సినిమాలు చూసేదాన్ని. హీరోయిన్లు వేసుకున్నట్టుగా దుస్తులు ధరించేదాన్ని. సినిమాలో హీరోయిన్లు వేసిన డ్రెస్ మళ్లీ వేసుకోరు కదా.. నేనూ అలాగే ఒకసారి ధరించిన డ్రెస్ మళ్లీ వేసుకోనని మారాం చేసేదాన్ని. ఇలా సినిమాల ప్రభావం నామీద చాలానే ఉంది.
మాది మంగళూరు. మోడల్, యాక్టర్ కావాలన్న లక్ష్యంతోనే బెంగళూరుకు వచ్చాను. డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్తుండేదాన్ని. చిన్నప్పుడే హార్లిక్స్ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ భలేగా అనిపించింది. నేను నటించిన యాడ్ టీవీలో వస్తుంటే థ్రిల్ అయ్యేదాన్ని. కాలేజ్ ఏజ్‌కు వచ్చాక మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నా. అప్పుడు కూడా సినిమా అవకాశాలు ఎలా వస్తాయన్న విషయం నాకు అర్థమయ్యేది కాదు! కానీ, చాన్స్ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలనే తపన మాత్రం బలంగా ఉండేది.
ఐశ్వర్యరాయ్, శిల్పాశెట్టి, దీపిక.. వీళ్లంతా మోడలింగ్ నుంచే సినిమాల్లోకి వచ్చారు! అందుకే, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మోడలింగ్ ఒక్కటే దారి అనిపించింది. మోడలింగ్‌లో ఉన్నప్పుడే మిస్ మంగళూరు, మిస్ సౌత్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నాను. ఆ ప్రయత్నాలే కన్నడ చిత్రం ‘ముంగారు మళె 2’లో అవకాశం వచ్చేలా చేశాయి. అలా నటిని కావాలన్న నా కల నెరవేరింది. మొదటి సినిమా పూర్తయ్యాక తెలుగులో అవకాశాలు వచ్చాయి. ‘డీజే టిల్లూ’తో నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభమైంది.
‘డీజే టిల్లూ’లో నాది చాలెంజింగ్ రోల్. అందులో ‘రాధిక’ పాత్ర నాకే కాదు, ప్రేక్షకులకూ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను బయట కనిపిస్తే అదే పేరుతో పిలుస్తుంటారు. ఆ పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది. ఆ తర్వాత వచ్చిన ‘మెహబూబా’, ‘గల్లీరౌడీ’, ‘రూల్స్ రంజన్’, ‘బెదురులంక’ సినిమాల్లోనూ మంచి పాత్రలు వచ్చాయి. మంచి స్క్రిప్ట్‌లు వస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపిస్తాను.
మాధురీ దీక్షిత్, శ్రీదేవి, సౌందర్య నా అభిమాన నటులు. చిన్నప్పుడు వారిని చూస్తూ పెరిగాను. ఎలాంటి పాత్రనైనా మెప్పించగల నటనా సామర్థ్యం వారిది. మాధురి డ్యాన్సంటే కన్నార్పకుండా చూస్తాను. యాక్టింగ్‌లో వాళ్లే నాకు ఆదర్శం. నేను ఆరాధించే నటీమణుల్లా సుదీర్ఘకాలం ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను.
ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అడపాదడపా పార్టీలు గట్రా జరుగుతాయి. నా వ్యక్తిగత విషయాలను మాత్రం చిన్ననాటి మంగళూరు స్నేహితులతోనే పంచుకుంటాను. వారిలో చాలామంది ఇప్పటికీ నాతో టచ్‌లో ఉంటారు.
ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. నాకు కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతాను. కుర్తీ, డెనిమ్ నా ఫస్ట్ చాయిస్. షార్ట్స్, టాప్ కూడా రెగ్యులర్‌గా ధరిస్తుంటాను. ఆ రోజు నా మూడ్‌ను బట్టి డ్రెస్ సెలెక్షన్ ఉంటుంది. అంతేకానీ, ప్రీప్లాన్డ్‌గా ఏదీ ఉండదు.