‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన తెలంగాణ పాపులర్ జానపద గీతం ‘ఏష నాగుల కట్టమీద’ మ్యూజిక్ ఛార్ట్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ పాట సంచలనం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. షూటింగ్ మొత్తం పూర్తి చేశామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని వేగవంతం చేశామని మేకర్స్ తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని పొడవాటి జడలు, గడ్డంతో చేతిలో తుపాకీ పట్టుకొని రగ్గ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని మేకర్స్ పేర్కొన్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.