Nani | నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కయాదు లోహర్ ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో నటిస్తోంది. విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మొదట ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయాలని భావించినప్పటికీ, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీ సెప్టెంబర్ 25కు మారే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ది ప్యారడైజ్’పై పూర్తి దృష్టి పెట్టిన నాని, ఇతర సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఆయన రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. మొదటిది, ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ సిద్ధం చేసిన కొత్త సినిమా. కథ నచ్చినా డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, ఆ ప్రాజెక్ట్‌ను వేరే హీరోతో ముందుకు తీసుకెళ్లాలని నాని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక రెండోది, ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించాలనుకున్న చిత్రం. కథపై నానికి మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ప్రస్తుతం జ్ఞానవేల్ హీరో సూర్యతో తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్‌తో కలిసి ‘బ్లడీ రోమియో’ అనే సినిమా చేయాలని నాని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ-2’ ప్రాజెక్ట్‌పైనా దృష్టి పెట్టడంతో, నాని-సుజీత్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.నిర్మాతపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నాని తన తదుపరి కమిట్మెంట్లను వాయిదా వేసి, ‘ది ప్యారడైజ్’ను పూర్తి చేయడంపైనే పూర్తి దృష్టి సారించినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది విడుదల తర్వాత తేలనుంది.