Nani | “మన ఇంటి మధ్యలో గోడ కడుతున్నారు.. సరే, ఎన్ని చూశాం, ఇది చూస్తూ కూర్చుందాం” అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌పై నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ఆ పోస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చర్చకు వస్తుంటుంది. అయితే, ఆనాడు తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన నాని చేతనే, నేడు వరుసపెట్టి అచ్చమైన తెలంగాణ బ్యాక్‌డ్రాప్ మాస్ సినిమాలు తీయిస్తుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకప్పుడు ఆ ప్రాంతపు సెంటిమెంట్‌ను తక్కువ చేసి చూసిన నానితోనే.. తెలంగాణ పల్లెటూరి సంస్కృతి, బతుకమ్మ జీవన విధానం, సింగరేణి కార్మికుల నేపథ్యంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ లాంటి రూరల్ డ్రామాను తెరకెక్కించి నానికే బ్లాక్ బస్టర్‌ను అందించాడు. ఇప్పుడు ఇదే కోవలో వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని జడల్ అనే వైలెంట్, ఊరమాస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన “యెష నాగుల కట్ట మీద…” తెలంగాణ ఫోక్ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిరుధ్ సంగీతం, విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
అయితే, ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన నటుడే, ఇప్పుడు పదే పదే అదే ప్రాంతపు సెంటిమెంట్‌ను వాణిజ్యపరంగా క్యాష్ చేసుకుంటున్నాడనే విమర్శలు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాస్ ఆడియెన్స్‌ను తమ వైపు తిప్పుకోవడంలో నాని-శ్రీకాంత్ ఓదెల జోడీ సఫలమవుతోంది. మరి సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Mana inti madhyalo goda kaduthunnarannamaata .. Sarey .. Enni chusam .. Idhi chusthu kurchundaamu.
— Nani (@NameisNani) July 29, 2013