Namitha | దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్న ఆమె.. కెరీర్లో ఎన్నో విజయాలతో పాటు కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో తాను ఎలా ఉండేదో గుర్తుచేసుకుంటూ నమిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు వరుస అవకాశాలు, విజయాలు రావడంతో తనలో తెలియకుండానే అహంకారం పెరిగిందని నమిత వెల్లడించారు. అప్పట్లో ఎవరి మాటా వినకుండా, తనకు నచ్చినట్లుగానే వ్యవహరించేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు.
తన ప్రవర్తన కారణంగా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని నమిత గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీలోని కొందరు శ్రేయోభిలాషులు తనకు సరైన సలహా ఇచ్చారని తెలిపారు.ఇదే తరహా అహంకారంతో కొనసాగితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవు అంటూ వారు తనను హెచ్చరించారని, ఆ మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని నమిత చెప్పారు. ఆ తర్వాత తన తప్పును గుర్తించి ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నానని వెల్లడించారు. కెరీర్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నానని నమిత అంగీకరించారు. కొన్ని కథలను ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల వల్ల తన కెరీర్‌పై ప్రభావం పడిందని తెలిపారు. అయితే ఆ అనుభవాలను ప్రతికూలంగా చూడకుండా, వాటి నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు.
గతంలో జరిగిన విషయాలను తలుచుకుంటే తనలో చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు జీవితాన్ని మరింత పరిణతితో చూస్తున్నానని నమిత చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నమిత 1998లో ‘మిస్ సూరత్’గా నిలిచారు. అనంతరం 2001లో ‘మిస్ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి మోడలింగ్, గ్లామర్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ఒక రాజు ఒక రాణి’, ‘ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’ వంటి సినిమాల్లో నటించారు. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘బిల్లా’లో గ్లామరస్ పాత్రలో కనిపించి మరింత పాపులర్ అయ్యారు. బాలకృష్ణ నటించిన ‘సింహా’ చిత్రంలోనూ ప్రత్యేక పాత్రలో మెప్పించారు. మోహన్‌లాల్ సరసన నటించిన ‘మన్యం పులి’తో మలయాళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.తమిళ చిత్ర పరిశ్రమలోనూ నమితకు భారీ క్రేజ్ లభించింది. ఒక దశలో ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేంతగా ఆదరణ లభించడం అప్పట్లో సంచలనంగా మారింది.