భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల వంటి అంశాల కలబోతగా రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ఐకే స్టూడియోస్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
సోమవారం హైదరాబాద్‌లో ‘నాగబంధం త్రీడీ స్టాండీ కర్టెన్ రైజర్’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. అబ్బురపరిచే విజువల్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఘట్టాలు, అడ్వెంచర్ ఎపిసోడ్స్‌తో మైథలాజికల్ చిత్రాలకు సరికొత్త నిర్వచనంలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర హిందీ హక్కులను జీ స్టూడియోస్ కొనుగోలు చేసింది. నభానటేష్, ఐశ్వర్యమీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు చిత్ర తారాగణం.