విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన డివైన్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఈ నెల 3న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతి, మూలాలను ఆవిష్కరించే గొప్ప కథ ఇదని, ప్రజలకు సనాత ధర్మ సందేశాన్ని అందిస్తుందని అన్నారు. పద్మనాభ స్వామి ఆలయం తాలూకు సెట్ ప్రేక్షకులను భక్తిప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆయన చెప్పారు.
ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం ఓ అద్భుతంగా ఉంటుందని హీరో విరాట్‌కర్ణ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘దాదాపు 110కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. విజువల్ వండర్లా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రతీ పదినిమిషాలకు ఒకసారి తెరపై ఓ సరికొత్త ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఈ సినిమా విజయంపై మరింత ధీమా పెరిగింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయిక నభా నటేష్, అగ్ర నిర్మాత సురేష్‌బాబుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.