ఎంతదూరమైనా వెళ్లాలనుకున్నా!

మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త పంథాలో పయనించడం అనివార్యమని చెప్పారు యువ హీరో నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకుడు. నేడు ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం నాగచైతన్య పాత్రికేయులతో సంభాషిస్తూ చెప్పిన సంగతులివి..
ఏ జోనర్ సినిమా అయినా కంటెంట్‌లో కొత్తదనం ఉండాలన్నది నా సిద్ధాంతం. సృజనాత్మకంగా విపరీతమైన స్వేచ్ఛ తీసుకొని చేసే కమర్షియల్ సినిమాలు నాకు అంతగా సూట్ కావన్నది నా అభిప్రాయం. అలా కొన్ని సినిమాల్లో ప్రయత్నించి ఫెయిలయ్యా. ప్రతి యాక్టర్‌కు ఓ స్పేస్ ఉంటుంది. నా వరకు లవ్‌స్టోరి వంటి సెన్సిబుల్ సినిమాల్లోనే కంఫర్టబుల్‌గా ఉంటుంది.
సినిమా కథకే నేను పెద్దపీట వేస్తాను. కలెక్షన్స్, బాక్సాఫీస్ లెక్కల గురించి అంతగా పట్టించుకోను. అదే సమయంలో దర్శకుల ఎంపిక విషయంలో కూడా చిన్నాపెద్దా అనే తారతమ్యాలు పాటించను. కంటెంట్ నచ్చితే ఏ దర్శకుడితోనైనా సినిమా చేస్తా. పాన్ఇండియా సినిమా ఆలోచన లేదు. నా తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకే. హిందీలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌సింగ్ చద్దా’ లో నటించా. మంచి అవకాశాలు వస్తే హిందీ సినిమాలు చేస్తాను. షూటింగ్ టైమ్‌లో ఆమిర్‌ఖాన్ దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయనతో సినిమా చేయడం కెరీర్‌కు చాలా ప్లస్ అయిందని భావిస్తున్నా.
ఆర్మూర్ దగ్గరలోని పిప్రిలో నెలరోజుల పాటు షూటింగ్ చేశాం. అక్కడి వారందరితో కలిసిపోయి ప్రతిరోజుని ఆస్వాదించా. గ్రామ ప్రజలందరూ మా యూనిట్‌ను ప్రేమతో చూసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది.
కరోనా ప్రభావంతో పాటు లాక్డౌన్ అవాంతరాల్ని దాటుకొని సినిమా ప్రేక్షకుల ముందుకురావడం ఎలాంటి అనుభూతినిస్తున్నది?
విజయంపై మా టీమ్ అంతా పూర్తి ధీమాతో ఉన్నాం. ప్రస్తుతం బయట ఫ్యామిలీస్ బాగానే తిరుగుతున్నారు. అయితే వాళ్లు థియేటర్లకు ఏ మేరకు వస్తారో అనే చిన్న సందేహం మాత్రం ఉంది. సినిమా బాగుంటే కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనుకుంటున్నా. కరోనా మొదటిదశ తర్వాత సినిమా రిలీజ్లు అయినప్పుడు కథా బలమున్న చిత్రాల్ని థియేటర్లలోనే వీక్షించారు.
‘లవ్‌స్టోరి’లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు..?
కుల, లింగ వివక్ష అనే రెండు సున్నితమైన అంశాల్ని టచ్ చేస్తూ శేఖర్ కమ్ముల ఈ సినిమాకు రూపకల్పన చేశారు. అయితే వాటిని ఆవిష్కరించిన విధానం కొత్తగా ఉంటుంది. ఈ రెండు సాంఘిక రుగ్మతల గురించి బాహాటంగా మాట్లాడటానికి మనలో చాలా మంది సంకోచిస్తారు. అలాంటి ధోరణికి స్వస్తిపలికి మన భావాల్ని ధైర్యంగా వ్యక్తీకరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ సినిమాలో చూపించాం. నిమ్నకులానికి చెందిన ఓ పల్లెటూరి అబ్బాయి పట్టణానికి వచ్చి జీవితాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అగ్ర కులానికి చెందిన అమ్మాయితో అతని ప్రేమప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులతో సాగింది? అనే అంశాలు కొత్తగా అనిపిస్తాయి.
శేఖర్ కమ్ములతో పనిచేసిన తర్వాత సినిమాల ఎంపికలో మీ ప్రాధామ్యాలు ఏమైనా మారాయా?
ఆయనతో ప్రయాణం నాలో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథాంశాలు సున్నితమైన భావోద్వేగాల్ని స్పృశిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. పూర్తి సహజమైన కథ, కథనాలతో సాగే సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘లవ్‌స్టోరి’ ద్వారా శేఖర్ కమ్ముల ఆ ఆవకాశమిచ్చారు.
తెలంగాణ యాస, భాషలపై పట్టు సాధించడానికి ఎలాంటి కసరత్తు చేశారు?
షూటింగ్ మొదలయ్యే మూడునెలల ముందే శేఖర్‌కమ్ముల తెలంగాణ యాసపై ప్రాక్టీస్ చేయించారు. ఓ మధ్యతరగతి యువకుడి సమస్యలు, జీవన విధానం ఎలా ఉంటుందో వివరించారు. రెఫరెన్స్ కోసం కొన్ని ఆర్టికల్స్ పంపించి చదవమని చెప్పారు. యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా కొంత అవగాహన పెంచుకున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్మూర్ దగ్గరలోని పిప్రి అనే గ్రామలో షూటింగ్ చేయడం వల్ల అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, యాసను ఒడిసిపట్టుకునే అవకాశం లభించింది. అదీగాక డబ్బింగ్‌కు చాలా సమయం దొరకడంతో యాసను పర్ఫెక్ట్గా పలికించడం సులభమైంది.
ట్రైలర్స్ చూసిన మీ అభిమానులు సినిమాలో కొత్త చైతూ కనిపిస్తున్నాడని అంటున్నారు?
సినిమా కంటెంట్ కొత్తగా ఉన్నప్పుడు తెలియకుండానే సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. షూటింగ్ సమయంలో దర్శకుడు శేఖర్‌కమ్ముల నిజాయితీ, అంకితభావం చూసినప్పుడు ఈ సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లాలనిపించింది. షూటింగ్ కోసం రెండొందల రోజుల్ని వెచ్చించినా ఫర్వాలేదనుకున్నా.
మీ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. నటుడిగా ఎలాంటి సంతృప్తినిచ్చింది?
ఇలాంటి సినిమా చేయడమే నిజమైన సంతృప్తిగా భావిస్తున్నా. ప్రస్తుతం సినిమాల ట్రెండ్ మారుతున్నది. కమర్షియల్ పంథాకు దూరంగా రియలిస్టిక్ కథాంశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యన దర్శకుడు సుకుమార్‌గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. ‘ప్రేక్షకులు మారుతున్నారు. మనమే పరిధుల్ని విధించుకుంటున్నాం. దాన్ని బ్రేక్ చేయాలనే ‘రంగస్థలం’ వంటి సినిమా చేశా’ అని ఆయన చెప్పారు.
ఈ సినిమా చేసిన తర్వాత కథల ఎంపికలో మీ ఆలోచనలు ఏమైనా మారాయా?
నాకు మనుషుల భావోద్వేగాలు, సమస్యల గురించి చర్చించడం అంటే చాలా ఇష్టం. అలాంటి కథలు నాలో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం స్టార్‌హీరోలు మాత్రమే ఎక్కువగా కమర్షియల్ కథల్ని అంగీకరిస్తున్నారు. యువతరం హీరోలు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త దారుల్ని ఎంచుకుంటే బాగుంటుంది. వాణిజ్య చిత్రాలకు భిన్నమైన కథల్లో నటించినప్పుడే గుర్తింపు లభిస్తుంది. కొత్త కంటెంట్‌తో రూపొందే సినిమాల్లో నటించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీలవ్వాలని భావిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

