అరంగేట్రం వరకే వారసత్వం, ప్రతిభ ఉంటేనే భవితవ్యం అని నమ్మిన కథానాయకుడు నాగ చైతన్య. అక్కినేని ఇంటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన నాగ చైతన్య…‘మనం’, ‘ప్రేమమ్’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలతో పేరున్న హీరోగా ఎదిగారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందించారు. ఈ నెల 22న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలతో పాటు కెరీర్ సంగతులూ పంచుకున్నారు నాగచైతన్య.
థాంక్యూ’ సినిమా మీకు విసిరిన సవాళ్లేమిటి?
ఈ సినిమా నాకు శారీరకంగా, మానసికంగా సవాల్లాంటిది. నా క్యారెక్టర్ మూడు ఛాయల్లో సాగుతున్నట్లు కనిపించినా ఇంకా ఎక్కువే షేడ్స్ ఉంటాయి. 16ఏళ్లు, ఇరవై ఏళ్లు, పాతికేళ్లు, 30 ఏళ్లు ఇలా కథానాయకుడి జీవితంలోని వివిధ సందర్భాలను చూపించాం. టీనేజ్ కుర్రాడిలా కనిపించేందుకు మూడు నెలల కసరత్తులు చేసి ఆ గెటప్‌లోకి మారాను. ఇలాంటి కథలు దొరకడం అరుదు. పదహారేళ్ల కుర్రాడిలా కనిపిస్తే ఇప్పుడు ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. మరో నాలుగైదేళ్లు అయితే ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేను.
‘ప్రేమమ్’తో ఎక్కడైనా పోలికలు ఉంటాయా?
ప్రేమ వల్ల మనిషి ఎలా ప్రభావితం అవుతాడు అనేది ‘ప్రేమమ్’ సినిమాలో చూపించాం. ఈ చిత్రంలో ఓ వ్యక్తి తన జీవితంలో కలిసే మనుషుల వల్ల ఎలా మార్పు చెందాడు అనేది తెరకెక్కించాం. ఈ సినిమాను వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. విదేశాల్లో మూడొంతుల షూటింగ్ చేస్తే, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మిగతా షూటింగ్ జరిపాం.
మీ పాత్ర ఎలా సాగుతుంది?
ఈ చిత్రంలో అభిరామ్ అనే పాత్రలో నటించాను. చిన్నప్పటి నుంచి ఓ బిజినెస్‌మెన్‌గా ఎదిగే క్రమంలో అతని లైఫ్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు విక్రమ్ ఈ పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఆయన చిత్రాల్లోని కొత్త తరహా స్క్రీన్‌ప్లే ఈ సినిమాలోనూ చూస్తారు. 12 ఏళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్నాను. గతంలోనూ ఈ సంస్థ నుంచి కథలు విన్నాను. ఇది బాగా నచ్చింది.
నాయికల పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. అయితే అవికా గోర్ది సోదరి పాత్ర. మాళవికా నాయర్ టీనేజ్‌లో ప్రేయసిగా కనిపిస్తుంది. రాశీ ఖన్నాది కీలకమైన పాత్ర. ఆమె క్యారెక్టర్ వల్లే అభిరామ్ ప్రయాణం మొదలవుతుంది. ఈ సినిమా వల్ల వ్యక్తిగతంగానూ నేను మారాను. గతంలో ఏ విషయాన్నైనా మనసులోనే ఎక్కువగా దాచుకునేవాడిని. ఈ చిత్రంలో నటించిన తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆ విషయాలను పంచుకోవడం ప్రారంభించా.
ఈ సినిమాలో మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తారా?
అభిరామ్ జీవిత ప్రయాణంలో యువకుడిగా అతను చూసిన సినిమాలను ప్రస్తావించాం. అందులో మహేష్ బాబు ‘ఒక్కడు’, ‘పోకిరి’ సినిమాలను అతను ఎంజాయ్ చేస్తాడు.
తీరిక లేకుండా వరుసగా చిత్రాల్లో నటిస్తున్నారు..?
పాండమిక్ వల్ల ముందు పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యమయ్యాయి. ‘లవ్ స్టోరీ’, ‘దూత’, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ ఇవన్నీ కోవిడ్ వల్ల ఆలస్యమైన ప్రాజెక్టులే. ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాను. ఇటీవల ఈ సినిమా ప్రివ్యూ షో చిరంజీవి గారు చూసి అభినందించారు. ఆయనే ఆ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తానని చెప్పడం ఆనందంగా అనిపించింది.
దర్శకులతో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
దర్శకులను పూర్తిగా నమ్ముతాను. వాళ్లు ఎంత బాగా చెబితే అంత బాగా నటిస్తా. ఇప్పటిదాకా ప్రేమకథలు, భావోద్వేగ కథల్లో దర్శకులు నన్ను చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కమర్షియల్ సినిమాలకు నేను సరిగ్గా సరిపోతానా? లేదా? అనే సందేహం కలిగింది. కొత్త దర్శకులతో సినిమాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. దాంతో కొంతకాలం డెబ్యూ డైరెక్టర్స్‌తో వద్దు అనుకున్నాను.
మీ తొలి వెబ్ సిరీస్ ‘దూత’ ఎలా ఉండబోతున్నది?
ఇందులో నేను పాత్రికేయుడిగా కనిపిస్తా. హీరోయిన్ ఉండదు. కేవలం నా పాత్ర ఆధారంగా వెబ్ సిరీస్ సాగుతుంది. ప్రస్తుతం ఎపిసోడ్స్ వర్క్ జరుగుతున్నది. త్వరలోనే దాని స్ట్రీమింగ్ డేట్ ప్రకటిస్తారు.
మీ సోదరుడు అఖిల్‌తో సినిమాల చర్చ జరుపుతుంటారా?
అతని సినిమాల సాంగ్స్, ఫైట్స్ సీన్స్ చూపిస్తుంటాడు. అఖిల్ ‘ఏజెంట్’ టీజర్ చూశాను. చాలా బాగుంది. లుక్ మార్చుకునేందుకు అతను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో అఖిల్‌కు కమర్షియల్ సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టంగా మారుతోంది కదా?
అవును. ఓటీటీలో అనేక రకాల వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇంట్లో కూర్చొనే చూసే వీలు ప్రేక్షకులకు దొరుకుతోంది. అలాంటప్పుడు థియేటర్లకు వారిని రప్పించాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాలి. ట్రైలర్ చూసే వాళ్లు సినిమాకు రావాలి అనుకోవాలి. కంటెంట్ కింగ్ అనే పరిస్థితి ఏర్పడింది. హీరోలు, దర్శకులు అంతా ఇందుకు సిద్ధమవ్వాలి.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి?
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపిస్తా. వెంకట్ ప్రభుతో ‘మానాడు’ సినిమా రీమేక్ చేయాల్సింది. రైట్స్ విషయంలో ఇబ్బందులతో కుదరలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. తరుణ్ భాస్కర్‌తోనూ సినిమా చేసే ఆలోచన ఉంది.