‘దర్శకుడు రవికాంత్ నాకు స్కూల్‌డేస్ నుంచి తెలుసు. అప్పట్లో తాను తీసే షార్ట్ ఫిలింస్‌కి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. ‘క్షణం’ టైమ్‌లో అతనిలోని పరిపూర్ణమైన దర్శకుడ్ని చూశాను. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘కృష్ణ అండ్ లీలా’ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘బబుల్గమ్’. హిట్ అయితే పక్కా..’ అంటున్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.
రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న ‘బబుల్గమ్’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. రవికాంత్ పేరెపు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీచరణ్ పాకాల విలేకరులతో మాట్లాడారు. ఇందులో హీరో డీజే కావడం చేత ఆ పాత్రకు తగ్గట్టుగా మ్యూజిక్ చేయడం జరిగిందని, ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లోని లేయర్లపై పరిశోధించి కొత్త సౌండింగ్‌తో మ్యూజిక్ ఇచ్చానని శ్రీచరణ్ చెప్పారు.
దర్శకుడు రవికాంత్ మంచి గాయకుడు, రచయిత అవ్వడం చేత చక్కని మ్యూజిక్ తీసుకున్నారని ఆయన అన్నారు. ‘ఇందులో ఇంటర్వెల్, క్లయిమాక్స్ సాంగ్స్‌ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. రోషన్లోని ఎనర్జీని దృష్టిలో పెట్టుకొనే మ్యూజిక్ చేశాను. ఈ సినిమా రోషన్‌కి పెద్ద బ్రేక్ అవ్వడం ఖాయం’ అన్నారు శ్రీచరణ్. ప్రస్తుతం సత్యభామ, గూఢచారి2 సినిమాకు సంగీతం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.