తన కన్నా పెద్ద వయసు క్యారెక్టర్ చేసి మెప్పించింది బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కి ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ సినిమాలో తల్లి పాత్ర విద్యలో కనిపించింది. సాధారణంగా నాయికలు తల్లి పాత్రలు చేస్తే తమపై అదే ముద్ర వేస్తారని భయపడుతుంటారు. అలాంటి క్యారెక్టర్లకు దూరంగా ఉంటారు. మృణాల్ మాత్రం విద్య పాత్రలో నటించింది.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ…‘తల్లి పాత్రలో నటిస్తే ఇక గ్లామర్ రోల్స్ దక్కవు అని నాకు కొందరు చెప్పారు. కానీ నటిగా నాకు ఆ క్యారెక్టర్ ఎంత బాగుంది అనేది ముఖ్యం. ఆ పాత్ర వయసు చిన్నదా పెద్దదా అని ఆలోచించను. గతంలోనూ ఎంతోమంది నటీనటులు తమ కన్నా చిన్నా, పెద్దా వయసు పాత్రల్లో నటించారు. నేను నటిస్తాను అని దర్శకుడు నమ్మితే చాలు. మేకప్, హెయిర్ ైస్టెల్, దుస్తుల్లో మార్పు చేసినంత మాత్రాన ఆ పాత్రకు నటిగా న్యాయం చేసినట్లు కాదు. ఆ క్యారెక్టర్లా ప్రవర్తించాలి’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఆంఖ్ మికోలి’, ‘లెఫ్టినెంట్ రామ్’, ‘పిప్పా’, ‘గుమ్రా’ వంటి సినిమాల్లో నటిస్తున్నది..