Mrunal Thakur | కెరీర్ ఆరంభంలో తాను కొన్ని విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నానని, దర్శకులు తన పాత్ర విషయంలో ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదని చెప్పింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాటి అనుభవాలను పంచుకుందీ భామ. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. దర్శకుడు సినిమాలోని పాత్ర గురించి ఏం చెబుతున్నారో అర్థం కాలేదు. ఓ లుక్ టెస్ట్‌కు వెళ్లినప్పుడు కూడా ఫొటోగ్రాఫర్ నాకు ఆ పాత్ర సూట్ కాదన్నట్లుగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనే వచ్చి క్షమాపణ చెప్పాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి’ అని తెలిపింది.
అయితే సినిమాల విషయంలో తనకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయని, తన పాత్ర విషయంలో దర్శకుడితో పాటు తన టీం కూడా సహాయం చేస్తుందని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ‘కొందరు నన్ను బరువు తగ్గితే బాగుంటుందని చెబుతుంటారు. కానీ ఆ అవసరం లేదు. తెరపై సహజంగా కనిపించడానికే నేను ప్రాధాన్యతనిస్తాను. దర్శకులు సూచనల మేరకు నటిస్తే ఏ పాత్రలోనైనా రాణించవొచ్చని నేను నమ్ముతాను’ అని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.