తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా తన అద్భుతమైన సంగీతంతో కోట్లాది మంది శ్రోతలను అలరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంగీత విభావరిని ఏర్పాటు చేస్తోంది. ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ పేరుతో నవంబర్ 28న హైదరాబాద్ నగరం వేదికగా ఈ భారీ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుక ప్రకటన మరియు అధికారిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి గంగుల కమలాకర్, సంగీత దర్శకుడు కోటి మరియు నిర్వాహకులతో కలిసి ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఎస్ఎమ్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, ఎన్ఎస్ఆర్ డెవలపర్స్, నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్, జిఎన్ఆర్ మయూక ఇన్ఫ్రా మరియు కాంచీపురం లక్ష్మీ వారాహి సిల్క్స్ సంస్థలు ఈ సంగీత మహోత్సవానికి ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఈ పోస్టర్ లాంచ్ వేడుకలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సంగీత దర్శకుడు కోటి గారితో ఉన్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను చిన్నతనం నుంచి గ్రామఫోన్ రికార్డుల కాలం నాటి నుండి కోటి గారి పాటలను వింటూ పెరిగానని, సాంకేతికత ఎంతో మారినప్పటికీ ఆయన అందించిన మెలోడీలు మరియు మాస్ బీట్లు నేటికీ అంతే తాజాదనంతో అలరిస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు రాజ్-కోటి ద్వయంగా, ఆ తర్వాత ఒంటరిగా కోటి గారు అందించిన సంగీతం వల్ల ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయని ప్రశంసించారు. తమ తరానికి కోటి గారి సంగీత ప్రతిభ గురించి బాగా తెలుసని, అయితే నేటి ‘జెన్ జీ’ (Gen Z) యువతకు కూడా ఆయన లెజెండరీ సంగీత స్థాయిని పరిచయం చేయడానికి ఈ నవంబర్ 28 కాన్సర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తాను నిర్మించే చిత్రాలకు కూడా కోటి గారే సంగీతం అందించాలని కోరుకుంటున్నానని, ఈ భూమిపై గాలి ఉన్నంత కాలం కోటి గారి పాటలు అమరంగా నిలిచిపోతాయని కొనియాడారు.
సంగీత దర్శకుడు కోటి ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, లెజెండరీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి పేరుకు ఎప్పుడూ భంగం కలగకూడదనే లక్ష్యంతోనే తన ప్రతీ పాటను మొదటి అవకాశంగా భావించి ప్రాణం పెట్టి పనిచేశానని పేర్కొన్నారు. 1984 నుండి 1994 వరకు రాజ్-కోటి కాంబినేషన్లో వచ్చిన పాటలు టాలీవుడ్‌ను ఊపేశాయని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి బ్రేక్ డ్యాన్స్‌కు తమ బీట్స్ తోడై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయని గుర్తు చేసుకున్నారు. రాజ్-కోటి విడిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు తన ఒంటరి సంగీత ప్రయాణాన్ని ఆదరించి ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించారని కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడూ భవిష్యత్తు సాంకేతికతను ఆలోచిస్తూ సంగీతాన్ని అందించానని, తన వద్ద సహాయకులుగా పనిచేసిన ఎ.ఆర్. రెహమాన్, దేవి శ్రీ ప్రసాద్, తమన్ మరియు హారిస్ జయరాజ్ వంటి దిగ్గజాలు ఈనాడు సంగీత ప్రపంచాన్ని ఏలడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరు అగ్ర హీరోలతో పనిచేసిన అనుభవం తనకు ఉందని, నవంబర్ 28న జరగబోయే ఈ ఐకానిక్ కాన్సర్ట్‌కు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖురాలు మంజుల రావు జూపల్లి మాట్లాడుతూ, కోట్లు సంపాదించిన వ్యక్తులు కొంతకాలానికే మరుగున పడిపోతారని, కానీ కోటి గారి లాంటి మహోన్నత కళాకారులు మాత్రం తరతరాల పాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. ఆయన పాటలు గొంతులోంచి మాత్రమే కాక నాభి నుండి ఉద్భవిస్తాయని, ఇలాంటి మహోన్నతమైన ఈవెంట్‌కు తనవంతు మద్దతు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ ప్రతినిధి శోభన్ మాట్లాడుతూ, ఆడియో క్యాసెట్ల కాలం నుండి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక యుగం వరకు రూపాంతరం చెందుతూ ఐదు దశాబ్దాలుగా శ్రోతలను అలరిస్తున్న ఏకైక సంగీత బ్రహ్మ కోటి గారని కొనియాడారు. ఆయన గుండెచప్పుడు వంటి బీట్లతోనే తామంతా పెరిగామని, ఈ చారిత్రాత్మక కాన్సర్ట్‌ను నిర్వహించడం తమ సంస్థకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. నవంబర్ 28న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ ప్రత్యక్ష సంగీత మహోత్సవం తెలుగు సినీ ప్రేమికులకు ఒక మరువలేని అనుభూతిగా మిగిలిపోనుంది.