Raviteja | పాన్ ఇండియా సినిమా చేయడం కాదు.. దాన్ని ప్రమోట్ చేసుకునే పద్ధతి కూడా తెలియాలి. లేకపోతే అలాంటి సినిమా చేసి కూడా వృథా అవుతుంది. గతంలో చాలా సినిమాలకు పాన్ ఇండియా ట్యాగ్ తగిలించారు. కానీ దాన్ని సరైన పద్ధతిలో విడుదల చేయలేకపోయారు. అందుకే దసరా, విరూపాక్ష అలాంటి సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయిన మిగిలిన భాషలో మాత్రం కనీస ప్రభావం చూపించలేకపోయాయి. వాటికి పాన్ ఇండియా అనే ట్యాగ్ తగిలించారు కానీ ప్రమోషన్ మాత్రం కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే చేశారు. అందుకే ఆ సినిమాలు వచ్చినట్టు కూడా మిగిలిన ఇండస్ట్రీలకు పెద్దగా తెలియదు.
ఏదో మొక్కుబడిగా ప్రమోషన్ అయితే చేసుకున్నారు కానీ.. కలెక్షన్స్ తీసుకొచ్చే ప్రమోషన్స్ కావవి. తాజాగా రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో కెరీర్లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేశాడు. ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు మాస్ రాజా. గత వారం రోజులుగా ఇండియా అంతా తిరుగుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు రవితేజ. అక్కడ అన్ని చానల్స్, యూట్యూబ్, డిజిటల్ ఇలా ఏవి వదలకుండా అన్నింటికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దానికి తోడు హిందీలో ఈయన చాలా అద్భుతంగా మాట్లాడుతాడు కాబట్టి భాష సమస్య కూడా లేదు.
పైగా హిందీలో కూడా ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. నార్త్ ఆడియన్స్ తనను బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నాడు మాస్ రాజా. దానికి తోడు ఇప్పటికే రవితేజ సినిమాలు చాలా వరకు హిందీలో రీమేక్ అయి మంచి విజయం సాధించాయి. దాంతో రవితేజ సినిమాలపై ఒక ఐడియా ఉంది అక్కడ ప్రేక్షకులకు. దాంతో కచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు హిందీలోనూ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు రవితేజ. ఒకవేళ ఇదే జరిగితే చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి ఒక పాన్ ఇండియన్ సినిమా విజయం సాధించినట్టు అవుతుంది. ఎందుకంటే కార్తికేయ 2 తర్వాత తెలుగు సినిమా ఏది దేశవ్యాప్తంగా విజయం సాధించలేదు. మరి చూడాలి టైగర్ అటాక్ ఎలా ఉండబోతుందో..!