మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ‘గాలి నాగేశ్వరరావు’ అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తాజాగా ఈ సినిమా తాలూకు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్‌గా పరిచయమవుతున్నారు. అనూప్‌రూబెన్స్ స్వరాల్ని అందిస్తున్న ఓ పాటను అరియానా, వివియానా ఆలపించబోతున్నారు. ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సినిమాలో ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని, అరియానా, వివియానా తమ గాత్రంతో అలరిస్తారని చిత్రబృందం పేర్కొంది. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కోన వెంకట్, సంభాషణలు: భాను, నందు, మూల కథ: జి.నాగేశ్వర రెడ్డి.