Gautam Ghattamaneni | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ప్రముఖ సోషల్ మీడియా రేటింగ్ యాప్ లెటర్‌బాక్స్ (Letterboxd) ద్వారా ఇచ్చిన సినిమా రేటింగ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ (Toxic) సినిమాకు గౌతమ్ కేవలం హాఫ్ స్టార్ (0.5) ఇవ్వడం, అలాగే తన తండ్రి మహేష్ బాబు సినిమాలకే కాకుండా ఇతర స్టార్ హీరోల చిత్రాలకు ఇచ్చిన రేటింగ్‌లు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
గౌతమ్ లెటర్‌బాక్స్ ప్రొఫైల్ ప్రకారం.. అతను ఇప్పటివరకు వివిధ భాషలు మరియు జోనర్లకు చెందిన 400లకు పైగా సినిమాలను వీక్షించినట్లు తెలుస్తోంది. అయితే ఇతరులతో సంబంధం లేకుండా, సినిమాల కంటెంట్‌ను బట్టి స్వతంత్రంగా రేటింగ్‌లు ఇవ్వడం ఈ డిబేట్‌కు ప్రధాన కారణమైంది. తన తండ్రి మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్స్ ‘పోకిరి’ మరియు ‘1: నేనొక్కడినే’ సినిమాలకు గౌతమ్ 5 నక్షత్రాల రేటింగ్ ఇవ్వగా, ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే ‘నిజం’, ‘వంశీ’ చిత్రాలకు 2 చొప్పున రేటింగ్ ఇచ్చాడు.
కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్-ఇండియా మరియు హాలీవుడ్ సినిమాలపై కూడా గౌతమ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘బాహుబలి 2’ చిత్రానికి 5 స్టార్లు ఇవ్వగా, ‘పెళ్లిచూపులు’, ‘సీతారామం’ సినిమాలకు 4.5 రేటింగ్ ఇచ్చాడు. మరోవైపు, యశ్ ‘టాక్సిక్’ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీకి కూడా అర నక్షత్రం రేటింగ్ ఇవ్వడం విశేషం. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి 2.5 రేటింగ్ ఇచ్చాడు.
ఇక సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, బంధుప్రీతికి తావు ఇవ్వకుండా సినిమాలోని కంటెంట్ ఆధారంగా నిజాయితీగా రేటింగ్‌లు ఇస్తున్నాడని కొందరు నెటిజన్లు గౌతమ్‌ను ప్రశంసిస్తుంటే, మరికొందరు సెలబ్రిటీ కుటుంబాల నుంచి ఇలాంటి బహిరంగ రేటింగ్‌లు రావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన వారి వ్యక్తిగత అభిప్రాయాలు, సినిమా రుచి ఇతరులలాగే ఉండటంలో తప్పులేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
