టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన తన సినిమా ఫస్ట్ లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్స్ తోను ఎన్నో రికార్డులు సృష్టించాడు. తాజాగా మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సర్కారు వారి పాట చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది రికార్డులు బ్రేక్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లో ఈ బ్లాస్టర్ ప్రోమోకు 25.7 మిలియన్ వ్యూస్, 7లక్షల 54వేల లైక్స్ వచ్చాయి. దీనితో మహేష్ బాబు ఖాతాలో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ రికార్డ్ పడ్డట్టు అయ్యింది.
సర్కారు వారి పాట టీజర్‌ని ఆగస్టు 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. అందుకు కొద్ది గంటలకు ముందే సర్ప్రైజ్ చేశారు. సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే ఈ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియో మహేష్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
టీజర్లో ముందుగా .. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా అనే డైలాగ్ రాగా, ఆ తర్వాత మహేష్ శత్రుమూకలను చితకొట్టేశారు. ”ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్, ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్” అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. యాక్షన్స్ సీన్స్‌కి హీరోయిన్ గ్లామర్ యాడ్ చేసి మొత్తంగా ఈ వీడియోను విజువల్ వండర్ అనేలా కట్ చేశారు డైరెక్టర్ పరశురామ్. ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్ అందం గురించి కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అదిరింది.