మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను(మా) అల్లరిపాలు కాకుండా సినీ పెద్దలు కాపాడాలని అన్నారు సినీ నటుడు ఓ. కల్యాణ్. ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చొరవచూపాలని తెలిపారు. ‘మా’ ఎన్నికల వ్యవహారంపై మంగళవారం ఓ కల్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ “మా’ అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది.గత పదిహేను ఏళ్లలో అసోసియేషన్‌లో వివాదాలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత సభ్యుల మధ్య ఐక్యత ఉండటం లేదు. తలోదిక్కుకు వెళుతున్నారు. అసోసియేషన్‌ను బతికించమని చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబుతో పాటు సినీ పెద్దలందరినీ కోరుతున్నా. ఈ సారి గొడవలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ‘మా’ భవనం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో బిల్డింగ్ కట్టలేకపోయారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు అసోసియేషన్ కోసం వేయి గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా అని అడుగుతున్నా. ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాష్‌రాజ్ ఇప్పటివరకు అసోసియేషన్‌లో జరిగిన అన్యాయాలపై ఎంతమందిని ప్రశ్నించారో చెప్పాలి. ఈ సారి ఎన్నికల్లో నేను ఏ పదవీకి పోటీచేయడం లేదు. ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు’ అని అన్నారు.