దివంగత సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కర్మ (13వ రోజు) కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, మహేష్ బాబు, సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ…‘నాన్న గారు నాకు అందించిన అతి పెద్ద బహుమతి మీ అభిమానం. ఆయన ఎక్కడికి వెళ్లిపోలేదు. మన మధ్యే ఉన్నారు. నాన్న గారు మన గుండెల్లో చిరకాలం ఉంటారు. నాతోనే ఉండి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తారు. మీ అభిమానం ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ…‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని అన్నయ్య సినిమాలో పాట ఉంటుంది. ఆయన అలాగే జీవించారు. సంతోషంగా వెళ్లిపోయారు. మీలాంటి లక్షలాది మంది అభిమానం ఆయన సొంతం చేసుకున్నారు’ అన్నారు.