సక్సెస్ మనిషి మీద ప్రభావం చూపించడం సహజమే. అయితే ఆ జయాపజయాలకు అతీతంగా వ్యక్తిత్వాన్ని కొనసాగించే వారే ప్రత్యేకంగా నిలుస్తారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ అలాంటి వ్యక్తే అంటున్నది అందాల తార కృతి సనన్. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భులయ్యా 2’ సినిమా ఘన విజయం సాధించింది. కష్టాల్లో ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ఒక ఆశారేఖ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద 230 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కార్తీక్, కృతి కలిసి గతంలో ‘లూకా చుప్పీ’ అనే సూపర్ హిట్లో నటించారు. ప్రస్తుతం ‘షెహజాదా’ అనే చిత్రంలో జోడీగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భూల్ భులయ్యా 2’ సక్సెస్ సంబరాన్ని వీరిద్దరూ జరుపుకున్నారు. కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ..‘నేను బలవంతంగా కృతి సనన్‌తో నా సినిమా ప్రమోషన్ చేయించడం లేదు. ఆమె నాకు ఇష్టమైన సహ నటి’ అని చెప్పగా.. ‘ఓ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా కార్తీక్‌లో ఏమార్పు లేదు. అతనేం మారలేదు’ అని కృతి సనన్ చెప్పింది. ‘షెహజాదా’ సినిమా తెలుగు హిట్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్నది.