తారాగణం: నాగశౌర్య, షెర్లీ సేథియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ
కథల ఎంపికలో తనదైన అభిరుచిని కనబరుస్తుంటారు యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభం నుంచి వినూత్నమైన సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. అయితే రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారానే ఆయన ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. నాగశౌర్య కెరీర్లో అదే సేఫ్ జోనర్‌గా కనిపిస్తుంది. దాంతో మరోమారు స్వీయ నిర్మాణ సంస్థలో ‘కృష్ణ వ్రిందా విహారి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
కృష్ణా చారి (నాగశౌర్య) సంప్రదాయ బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. తల్లి అమృతవల్లి (రాధిక ) మాటను జవదాటడు. కోనసీమలోని ఓ అగ్రహారం నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అతను తొలి చూపులోనే తన టీమ్ లీడర్ అయిన వ్రింద (షెర్లీ సేథియా) ప్రేమలో పడతాడు. వ్రింద ఆధునిక భావాలు కలిగిన యువతి. తన ఇష్టాల మేరకు స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలని అభిలషిస్తుంటుంది. ఇద్దరి నేపథ్యాలు, ఆలోచనా ధోరణలు వేరుగా ఉండటంతో తొలుత కృష్ణ ప్రేమను తిరస్కరిస్తుంది వ్రింద. అనంతరం కృష్ణ మంచితనం గురించి తెలుసుకొని మనసు మార్చుకుంటుంది. అయితే వ్రిందకు ఓ సమస్య ఉంటుంది. దాని గురించి కృష్ణ ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లికి అంగీకారం తీసుకోవాలని షరతు పెడుతుంది. ఇంట్లో అబద్దం చెప్పి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ జంట వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటన్నదే మిగతా కథ..
దర్శకుడు అనీష్‌కృష్ణ రాసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కథాపరంగా కొత్తదనం ఏమీ కనిపించదు. కథా నేపథ్యాన్ని పరిశీలిస్తే గతంలో వచ్చిన కొన్ని సినిమాలు స్ఫురణకు వస్తాయి. భిన్న కుటుంబ నేపథ్యాలు, ఆలోచనా ధోరణులు కలిగిన నాయకానాయికల కథలతో చాలా సినిమాలొచ్చినా వాటిని తెరపై తీసుకొచ్చే విధానంలోనే ప్రేక్షకులు కొత్తదనం ఫీలవుతుంటారు. ఈ తరహా ఇతివృత్తాల్లో కావాల్సినంత సంఘర్షణ, భావోద్వేగాల్ని పండించేందుకు వీలుంటుంది. దర్శకుడు అనీష్ కృష్ణ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా కథను నడిపించే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థమంతా వినోద ప్రధానంగా సాగింది. నాగశౌర్య, సత్య, రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాల్లో నవ్వులు పండాయి. వ్రింద తన సమస్యను రివీల్ చేయడంతో కథ కాస్త మలుపు తీసుకుంటుంది. ఇంటర్వెల్ ముందు పెళ్లి చూపుల ఘట్టం చక్కటి వినోదంతో అలరించింది.
ద్వితీయార్థంలో కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది. తన కుటుంబంతో వ్రింద సర్దుబాటు కాకపోవడంతో కృష్ణచారి సంఘర్షణకు లోనవుతుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగాయి. అత్తాకోడళ్ల మధ్య వచ్చే గొడవ వినోదాన్ని పంచింది. ఇక పతాక ఘట్టాల్లో వెన్నెల కిషోర్ కోమా ఎపిసోడ్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది. సెకండాఫ్‌లో ఆ ఎపిసోడ్ ఆసాంతం హైలైట్‌గా నిలిచింది. ైక్లెమాక్స్ సన్నివేశాలన్నీ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగాయి. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా కథను సుఖాంతంగా ముగించారు. సింపుల్ కథను వినోదప్రధానంగా కొత్త హంగులతో తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యారు. ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించాలనే అతని ప్రయత్నం ఫలించింది. అయితే ఈ సినిమాలో ప్రేమకథను బలంగా రాసుకుంటే బాగుండేదనే భావన కలుగుతుంది. నాయకానాయికల మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాలు, పెళ్లి వైపు వారి ప్రయాణంలో ఏదో ఎమోషన్ మిస్సయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఔన్సర్స్ను పోలిన ఉద్యోగుల్ని చూపించడం కూడా ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు.
ఈ తరహా కథలకు నాగశౌర్య చక్కగా సరిపోతాడు. మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. ఆయన స్క్రీన్‌ప్రజెన్స్ కూడా బాగుంది. కథానాయిక షెర్లీ సేథియా ఫర్వాలేదనిపించింది. ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పడం బాగాలేదు. తల్లి పాత్రలో రాధిక తనదైన శైలి చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. పతాకఘట్టాల్లో ఆమె నటన బాగుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ పాత్రలు మంచి వినోదాన్ని అందించాయి. మిగతా పాత్రధారులు పరిధుల మేరకు నటించారు. సాంకేతికంగా ప్రతి అంశంలో ఉన్నతంగా ఉందీ చిత్రం. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా అనిపించింది. రెండు పాటలతో పాటు వాటిలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. నాగశౌర్య స్వీయ నిర్మాణ సంస్థ కావడంతో వ్యయం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్రేక్షకులకు ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించాలన ప్రయత్నమే ‘కృష్ణ వ్రింద విహారి’. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.