‘కొత్త సినిమా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజర్ దర్శకుడు. మహమ్మద్ వసీమ్ అక్రమ్, సాగి సుధీర్‌రావు, యడండ్ల సతీశ్‌యాదవ్ నిర్మాతలు. త్వరలో సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరిట ఓ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించారు.
దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, వీఎన్ ఆదిత్య, ఎన్.శంకర్, వీరశంకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మొత్తం కొత్తవారితో ఈ సినిమా చేశామని, ఇదొక వినూత్న ప్రయత్నమని, ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఈ సినిమా ప్రయాణంలో ఇంత దూరం వచ్చామని, తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు అజర్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా డీవోపీ జానీభాషా, సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్, నటుడు రాకేష్, సురేశ్, క్రిటిక్ చల్లా శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.