KGF | ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యారు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ సినిమాలను జపాన్లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ ‘ఈ అద్భుతమైన యాక్షన్ చిత్రాలు మీకు కూడా నచ్చుతాయని భావిస్తున్నా. ఈ నెల 14న జపాన్ ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ వీడియో సందేశాన్ని అందించారు.
గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలకు జపాన్లో మంచి మార్కెట్ ఏర్పడింది. త్రీ ఇడియట్స్, ఏక్తా టైగర్, బాహుబలి సిరీస్, ధూమ్-3, కబాలి, రేస్-3 వంటి చిత్రాలు జపాన్లో మంచి వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని జపాన్లో విడుదల చేస్తున్నారు. ఇదిలావుండగా తన తదుపరి చిత్రంపై హీరో యష్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ‘కేజీఎఫ్-3’ కోసం సన్నద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.