Kathanar | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘బాహుబలి’ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు భారీ అంచనాల మధ్య మలయాళంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ‘కథనార్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మాణంలో, దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుష్కతో పాటు జయసూర్య, ప్రభుదేవ , సనూప్ సన్, వినీత్, శాండీ మాస్టర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘కథనార్’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజువల్స్, సెట్టింగ్స్, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్లో అనుష్క కనిపించిన తీరు, ఆమె పాత్రలో ఉన్న గంభీరత, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ సినిమాలో ఫాంటసీ, హారర్, థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘బాహుబలి’ తరహాలోనే మరోసారి బలమైన పాత్రలో ఆమె కనిపించనుందని ట్రైలర్ సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, ‘కథనార్’తో అనుష్క మళ్లీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.