Karunakaran | టాలీవుడ్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఏ.కరుణాకరన్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. ‘తొలి ప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత కొత్త సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2018లో వచ్చిన తేజ్ ఐ లవ్యూ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరుణాకరన్, ఇప్పుడు యువ హీరో బెల్లంకొండ గణేష్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. కరుణాకరన్ స్టైల్‌కు తగ్గట్లుగా సాఫ్ట్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టగా, యువ దర్శకుడు అనుదీప్ కేవీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు అనుదీప్ డైలాగ్స్ అందించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘జాతి రత్నాలు’లో తన యూనిక్ కామెడీతో ఆకట్టుకున్న అనుదీప్ టచ్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల చార్ట్‌బస్టర్ పాటలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు అయిన గణేష్.. 2022లో స్వాతిముత్యంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ చిత్రంతో గుర్తింపు రాలేదు. మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయినా ముందుకు సాగలేదు. ఇప్పుడు కరుణాకరన్ లాంటి సీనియర్ డైరెక్టర్‌తో సినిమా చేయడం అతని కెరీర్‌కు కీలకంగా మారనుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన కరుణాకరన్.. ఇప్పుడు యంగ్ హీరోతో పనిచేయడం ఆసక్తికరంగా మారింది. మంచి కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.