Kartik Aryan | బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’. కబీర్‌ఖాన్ దర్శకుడు. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి అంగ వైకల్యానికి గురైన ఓ మాజీ సైనికుడి జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అంగవైకల్యంతో బాధపడుతూ 1972లో జరిగిన ప్రపంచ పారా ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని తెలిసింది.
మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో చిన్నగా కత్తిరించుకున్న జుత్తుతో ఇండియా బ్లేజర్ ధరించి కనిపిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. దర్శకుడు మాట్లాడుతూ ‘కార్తీక్ ఆర్యన్ కెరీర్లోనే ఓ విభిన్నమైన చిత్రమిది. ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తారు. దేశభక్తితో పాటు నేటి యువతలో స్ఫూర్తినింపే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’ అని పేర్కొన్నారు. సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.