Khaidi 2 | కోలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్దార్ 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో కార్తి చేసిన ఓ ఫన్నీ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ 2’ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కార్తి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై సరదాగా వేసిన కౌంటర్‌తో ఈవెంట్లో నవ్వులు, విజిల్స్ మోగిపోయాయి. ‘సర్దార్ 2’ ఈవెంట్లో అభిమానులు ఒక్కసారిగా *‘ఖైదీ 2 అప్డేట్ కావాలి’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో కార్తి నవ్వుతూ స్పందించారు.
ముందుగా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న ‘సర్దార్ 2’ సినిమాను చూడాలని, ఆ తర్వాత ‘ఖైదీ 2’ను ప్రారంభిస్తామని ఫ్యాన్స్‌కు సరదాగా ప్రామిస్ చేశారు. అక్కడితో ఆగకుండా లోకేష్ కనగరాజ్ గురించి కూడా కార్తి ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రస్తుతం లోకేష్ సినిమాలు తీయడం పక్కన పెట్టి యాక్టింగ్ చేస్తూ ఊళ్లు తిరుగుతున్నాడంటూ సరదాగా కౌంటర్ వేశారు.కార్తి చేసిన ఈ కామెంట్‌కు ఆడిటోరియంలో అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. క్లాప్స్, విజిల్స్‌తో ఈవెంట్ సందడిగా మారింది. 2019లో విడుదలైన ‘ఖైదీ’ సినిమా కార్తి కెరీర్లోనే కాకుండా తమిళ, తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఎలాంటి హీరోయిన్, పాటలు, రొమాంటిక్ ట్రాక్ లేకుండా పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇదే సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కు బీజం వేశారని చెప్పొచ్చు. ఇందులో కార్తి పోషించిన ‘ఢిల్లీ’ పాత్రకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘ఖైదీ’ తర్వాత లోకేష్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లారు. విజయ్‌తో ‘మాస్టర్’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్’, విజయ్‌తో ‘లియో’, రజనీకాంత్‌తో ‘కూలీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో ‘ఖైదీ 2’ వస్తుందని పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. మధ్యలో లోకేష్ కనగరాజ్ నటుడిగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘DC’ యాక్షన్ డ్రామాలో ఆయన కీలక పాత్రలో కనిపించారు. అలాగే రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బెంజ్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌తో *‘AA23’ సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ చేతిలో ప్రస్తుతం దర్శకత్వంతో పాటు నటన, నిర్మాణానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి.