Kangana Ranaut | దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ శనివారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్ర విజయానికి ఆదిత్య ధర్ కృషిని కొనియాడుతూ, ఆయనను ఒక “సూపర్ స్టార్ ఫిలిం మేకర్”గా అభివర్ణించారు. హాలీవుడ్లో స్టీవెన్ స్పీల్బర్గ్, క్వెంటిన్ టరాన్టినో, క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులకు అక్కడి నటుల కంటే ఎక్కువ స్టార్డమ్ ఉంటుందని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆదిత్య ధర్ కూడా అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారని ఆమె రాశారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు తరచుగా అధిక పనిభారంతో, తక్కువ వేతనంతో సూపర్ స్టార్ల వేధింపులకు గురవుతుంటారు. దీనివల్ల యువతలో దర్శకత్వం, సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి తగ్గి, కేవలం నటులవ్వాలనే కోరిక పెరిగిపోతోందని ఆమె విశ్లేషించారు. అయితే ఆదిత్య ధర్ సాధించిన ఈ విజయం అటువంటి ధోరణిని మారుస్తుందని, ఏ హీరో కంటే తక్కువ కాకుండా ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఆయన మెరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో కొత్త తరం యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దర్శకత్వం వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆదిత్య ధర్‌కు అభినందనలు తెలిపారు.