ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సీక్రెట్ గెటప్ గురించి కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇప్పటికే విడుదల చేసిన లుక్‌తో పాటు సినిమాలో ఎన్టీఆర్ సీక్రెట్ లుక్ ఒకటి ఉంటుందని, అది సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఉంటుందని తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆ సీక్రెట్ గెటప్ ఏమిటో అనే ఆసక్తి మొదలైంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తాడని అంటున్నారు.విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతపు నేపథ్య కథాంశంతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.