Jayam Ravi | ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి. ఆయన కథానాయకుడిగా వస్తున్న మరో చిత్రం ‘సైరన్’. కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ మాస్ ఎంటర్టైనర్ను గంగ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో ఈ నెల 23న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జి.వి తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్న పాత్రలు పోషించాను’ అని అన్నారు.
దర్శకుడు ఆంథోనీ భాగ్యరాజ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం నాకొక కలలా సాగింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం.. అదీ పెద్ద హీరోతో అయినప్పుడు కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటాం. ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ సినిమా మిగతా ముఖ్య తారాగణం: సముద్ర ఖని, యోగిబాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్, నిర్మాత: సుజాత విజయ్‌కుమార్, రచన-దర్శకత్వం: ఆంథోనీ భాగ్యరాజ్.