షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 600 కోట్ల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై అగ్ర హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. షారుఖ్‌ఖాన్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రమని, తాను ఆయన్ని ఇలాంటి మాస్ రోల్లో చూడాలని కోరుకున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు షారుఖ్‌ఖాన్ స్పందిస్తూ అల్లు అర్జున్ను ఆకాశానికెత్తారు. ‘నీ అభిమానానికి కృతజ్ఞతలు. ది ఫైర్ స్వయంగా నన్ను పొగడటం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తున్నది. ‘పుష్ప’ చిత్రాన్ని మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. మీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి నా సంతోషాన్ని పంచుకుంటా’ అని షారుఖ్‌ఖాన్ ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.