ఓటీటీ ప్రియులకు హుమా ఖురేషీ గురించి పరిచయం అక్కర్లేదు. ‘మహారాణి’వెబ్‌సిరీస్‌తో ఆమె పేరు మార్మోగిపోయింది. దశాబ్దం కిందట ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’తో సినిమాల్లోకి అడుగు పెట్టిన హుమ వరుసగా అవకాశాలు అందుకుంటూ మంచి నటిగా గుర్తింపుపొందింది. ఓటీటీలో దూసుకుపోతున్న ఈ నటి అంతరంగం ఇది..
కెమెరా ముందు మాత్రమే నేను నటిని. ఒక్కసారి కట్ చెప్పగానే మామూలుగా మారిపోతాను. అలా కాకుండా ఆ పాత్రను ఇంటివరకూ మోసుకెళ్తే మనకంటూ ఒక జీవితం లేకుండా పోతుంది. అందుకే, నేను ఏ పాత్రకూ ఎమోషనల్‌గా కనెక్ట్ కాను. నటన నాకు ప్రొఫెషన్ మాత్రమే! వంద శాతం అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. అన్నిటికన్నా ముఖ్యంగా దర్శకుడు చెప్పింది చేయడమే నాకు అలవాటు.
సినిమాల్లోకి రావాలని పెద్ద కోరికేం ఉండేది కాదు. అలాగని వెళ్లొద్దనీ అనుకోలేదు. అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడే చాలా విషయాలు తెలుసుకోగలిగా. నాది కాస్త రఫ్ అండ్ టఫ్ పర్సనాలిటీ. మనం ఎలా ఉన్నామో.. అలాగే కనిపించాలనుకునే టైప్ అన్నమాట. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు సాదాసీదాగా వెళ్లేదాన్ని. సల్వార్ కమీజ్ వేసుకొని, లంచ్ బాక్స్ పట్టుకొని సాధారణంగా వెళ్తుండేదాన్ని. నా అవతారం చూసి కాస్టింగ్ డైరెక్టర్లు కనీసం నన్ను పలకరించేవాళ్లు కాదు. నేను మాత్రం అదే కంటిన్యూ చేశాను. ఎవరి మెప్పు కోసమో మనం ఎందుకు మారాలి?
ఒక మనిషిని చూడగానే ఒకరకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అది నూటికి నూరు శాతం కరెక్ట్ అవ్వాలనేం లేదు. కానీ, ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ ద బెస్ట్ అని నా విషయంలో చాలాసార్లు రుజువైంది. మనకు కలిగిన అభిప్రాయాన్ని కాదని, ఎదుటి వ్యక్తిని మెప్పించడానికో, వారి దృష్టిలో మనం మంచివాళ్లం అనిపించుకోవడానికో ప్రయత్నించాల్సిన పనిలేదు. ఎప్పుడైతే ఇలాంటి భావన కలుగుతుందో, అప్పుడు బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి. అవన్నీ అవసరమా అనిపిస్తుంటుంది.
సినిమాల్లోకి వెళ్తానంటే మా తల్లిదండ్రులు షరతులతో కూడిన అంగీకారం తెలిపారు. ఇప్పటివరకైతే నేను వాటిని దాటలేదనే భావిస్తున్నా. ‘వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అని ఇప్పుడు వాళ్లే చెబుతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’ చూసినప్పుడు మొదటి సీన్ తర్వాత నాన్న నాతో ‘ఇందులో నువ్వయితే అసభ్య పదజాలంతో మాట్లాడలేదు కదా’ అని అడిగారు. లేదు అని చెప్పా! తర్వాత గానీ ఆ సినిమా చూడలేదు!! ‘మహారాణి’ వెబ్‌సిరీస్ నాకు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. మా ఇంట్లో వాళ్లకూ చాలా బాగా నచ్చింది.